Saturday, June 25, 2011

నాకు నచ్చిన నవలలో నా హృదయాన్ని హత్తుకున్న దృశ్యం


మీరందరూ చదివిన “మృత్యుపత్రం”(వీలునామా) ఉరిశిక్ష పడిన ఆ నక్సలైట్ ఖైదీ డిక్టేట్ చేస్తున్నప్పుడు విన్న జైలు సూపరిన్ టెన్ డెంట్ (ఆంగ్లో ఇండియన్) గ్లాడ్ ను కలవర పరుస్తుంది. ప్రసవానికి ఇండియా వచ్చిన తన కూతురు ‘జీన్’ కు చెబుతాడు ఆ మృత్యుపత్రం గురించి. విన్న గ్లాడ్ సాబ్ కూతురు “డాడీ ఇటీస్ ఏ రేవల్యుషనరీ పోయెం.” నాకీ కవిని కలవాలని ఉంది. అంటుంది…….
………… ……. గ్లాడ్ సాబ్ జైలులో నక్స లైట్ ఖైదీ నం 842 వీరభూషణ్ పట్నాయక్ తో “చూశావా నాకూతురు నిన్ను కవి అంది, నక్స లైట్ అనలేదు.కలుస్తావా ఆమెను?మాట్లాడతావా ఆమెతో? చిన్న కుర్రాడిలా అడిగాడు.
” ఏం?ఎందుకు మాట్లాడను? తనను,తన కవితలను మెచ్చుకునే పాఠకులు అంటే కవి కెప్పుడు అభిమానమే కదా” అన్నాడు వీరభూషణ్ పట్నాయక్ (ఉరి శిక్ష పడినఖైదీనం842).
“అరె!ఆమెను కలుసు కున్నాక ఏం మాట్లాడాలో తోచదు నీకు,ఆమెకేసి చూస్తూనే ఉండిపోతావు.నా కూతురు అని చెప్పడం కాదుకాని ఆమె యెంత అందగాడో చెప్పనలవి కాదు.ఎంత అందగత్తో నీకేం తెలుసు?ఏదీ ఉహించుకో చూద్దాం. నువ్వెంత అంచనా వేయగలవో నా కూతురు అందాన్ని”అన్నాడు గ్లాడ్ కైదీతో.
“మహా అయితే నా మృత్యువంత అందంగా వుంటుంది.”అన్నాడు ఉరిశిక్ష పడిన నక్స లైట్.
ఆ మాట వింటూనే కటకటాల్లోకి చెయ్య పోనిచ్చి పట్నాయక్ తల పట్టుకొని కటకతాలకు మెల్లగా తాటిస్తూ ” యూ బ్రేవ్ యంగ్ మాన్ రెండేళ్ళ క్రితమే నీవు నాకు పరిచయం అయి వుంటే నా కూతురుని నీకే ఇచ్చేవాడిని ……….. ఆల్ రయిట్, సాయంత్రం నా కూతురును తీసుకొస్తాను ఎడురుచూస్తుండు.” అంటూ మెల్లగా కదలి పోయాడు గ్లాడ్.
………..”ఎలావుంది మా అమ్మాయి?” గర్వంగా అడిగాడు గ్లాడ్ సాబ్
“అందంగా” వీర భూషణ్ పట్నయం జవాబు
“ఎంత?” గ్లాడ్ సాబ్ దర్పంతో కూడిన ప్రశ్న
“ఎంత అందంగా అంటే ……ఈమెను చూసి వుంటే చాలామంది రొమాంటిక్ కవుల కవితలు మరింత రొమాంటిక్ గా బాగా అందమయిన వర్ణనలతో వచ్చి ఉండేవి.” అన్నాడు పట్నాయక్
ఈ మాట వింటూనే ఫాసీ గేటు ఆవరణ అంతా దద్దరిల్లేలా నవ్వాడు గ్లాడ్ సాబ్.తన కూతురు అందచందాలను నక్స లైట్ ఖైదీ మెచ్చుకోవడంతో సాబ్ తనను తాను మరిచిపోయి మనసారా నవ్వుతూ అడిగాడు ” జీన్ ను చూసి నీకు ఏమన్నా కవిత్యం పుట్టుకు రాలేదూ?”
“లేదు. నాకామెను చూస్తుంటే వాళ్ళ అమ్మ హత్య గుర్తొచ్చింది.” -పట్నాయక్.
(గ్లాడ్ సాబ్ భార్య మారా {జీన్ కన్న తల్లి } జర్మన్ జ్యూస్. ఆమెను నియంత హిట్లర్-గెస్ట ఫోలు గ్యాస్ చాంబర్ లోకి తోసి చంపేశారు.అప్పటికి జీన్ రోజుల పాప.)
అంటే ఆ మాటతో గ్లాడ్ సాబ్ గుండె చెరువయ్యింది. జీన్ విస్మయంగా నక్స లైట్ కేసి చూసింది. అతని కళ్ళల్లో అశ్రువులు.
ఫాసీ గేటు ప్రాంతం అంతా నిశ్సభ్డం కాసేపయిన తర్వాత ఆ మౌనాన్ని బద్దలు కొడ్తూ జీన్ ” మీకు చూయించాలని నాకవితల నోట్బుక్ తెచ్చాను.”అంది.
“ఓ…. అలాగా ఏదీ చూద్దాం ” తనను తాను సర్దుకుంటూ అన్నాడు పట్నాయక్.
జీన్ తన చేతిలోని నోట్ బుక్ అతనికిచ్చింది.అతను ఆ పుస్తకాన్ని ఓ పర్యాయం తిరగేసాడు.చాలా ఖరీదయిన నీలం రంగు అందమయిన నోట్ బుక్ అట్టపైనమంచి సువాసనలు వెదజల్లే సెంట్ అద్దినట్లుంది. అందమయిన గుండ్రటి అక్షరాలతో చాలా కవితలు వ్రాసి వున్నాయి.శ్రీమంతుల ఇంట గారాల ఏకైక పుత్రిక వ్రాసే కవితల్లాగే వున్నాయి.నక్షత్రాలు,చంద్రుడు,వెన్నెల,చల్ల గాలులు,పిల్ల తెమ్మెరలు,తుమ్మెదల ఝుమ్మనే నాధాలు,మైదానాలు,ఇసుక తిన్నెలు,ఏటివడ్డులు,పడవ ప్రయాణాలు,….. ఇంక ఇంకా ఎన్నో అరిగిపోయిన రికార్డుల్లాంటి అమర ప్రేమలు ….. అలాంటివే.
ఒకటి రొండు కవితలు చదివాక ఆ నోట్ బుక్ తిరిగి ఇచ్చేస్తూ జీన్ తో “కవితలు అసంపూర్తిగా వున్నాయి ” అన్నాడు పట్నాయక్ .
“ఎందుకని?” గారాభంగా అడిగింది జీన్.
“వీటిలో జోలపాట లేవి?ప్రపంచంలో మొట్టమొదటి కవిత స్త్రీ నోటెంట జోలపాటగా బయటపడింది అందుకే కవిత శబ్దం స్త్రీలింగ శబ్దం. పుంలింగ శబ్దం కాదు.” అన్నాడు పట్నాయక్.
జీన్ నిరుత్తరురాలయింది.నిశ్శబ్దంగా ఉండిపోయింది.ఆరు గంటలు కొట్టారు జైల్లో వెళ్ళే ముందు “ఒక్కమాట అడగనా?” అంది జీన్. అడగమన్నట్టు తలూపాడు పట్నాయక్
“మీ మృత్యుపత్రం పవిత్రంగాను, ఎంతో తెజోవంతంగాను వుంది. చాలా చాలా బావుంది ‘ఓ క్రాంతి వీరుడి కవితలా’….. …… కానీ నా ఆవేదనల్లా ఆ విధంగా ఒక్కొక్క అవయవాన్ని మీ ఒంట్లో నుండి ఊడబెరుకుతుంటే, ఆ హింస, ఆ వేదన మీరెలా భరించ గలరు?మీకు భరించలేని బాధ కదా?మీరెలా భరించ గలరు?”అంది జీన్.
లేదన్నట్టు తలూపి వీర భూషణ్ పట్నాయక్ మెల్లగా అన్నాడు”ఏవి గొడ్డునోప్పులు కావో వాటికై దుఃఖించే పనిలేదు.” యార్డుల్లో హర్కేంలాన్తర్లు వెలుగుతున్నాయ్. గ్లాడ్ సాబ్ కూతురిని తీసుకొని బయల్దేరాడు.
…….నిద్రపోతున్న గ్లాడ్ నైట్ లాంప్ వెలుగులో మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తూ పక్కకు ఒరిగాడు గుమ్మందగ్గర అస్తవ్యస్తంగా వున్నా దుస్తులతో చిందరవందర జుట్టుతో జీయన్ నుంచుంది.తండ్రి మేల్కొన్నది గ్రహించి దగ్గరకొచ్చి మంచం పై కూర్చుంది. జీన్ ముఖం దుఃఖంతోఅలసిపోయిందని,ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయని,చెక్కిళ్ళు ఉబ్బాయని గుర్తించాడు గ్లాడ్. కూతురిని దగ్గరకు తీసుకొని “నిద్ర రావడంలేదామ్మా? భయం వేస్తుందా?” అంటూ బుజ్జగించాడు.
కాదన్నట్టు తలాడించి తండ్రి ఒళ్లో కాసేపలాగే ఉండిపోయింది జీన్. కొంచెంసేపాగి ఆవేశంతో లేచి తండ్రిని రెండు చేతులతో పట్టుకొని ఊపుతూ “పప్పా! యూ మస్ట్ బిహేవ్ విత్ ఎ సోల్జర్ లైకె సోల్జర్ .”అంటూ అరిచింది.
గ్లాడ్ సాబ్ ఉలిక్కిపడ్డాడు.అతని నిద్ర పారిపోయింది.కూతుర్ని అడిగాడు.”వాట్ డు యూ మీన్ జీన్?”అంటూ.
“ఐ మీన్ పప్పా ………. హి ఈజ్ నాటే ట్రేటర్ ……. పపా; హి ఈజ్ గ్రేట్ రెవెల్యూషనరీ ………
………. రియల్లీ హి ఈజ్ బ్రేవ్ సోల్జర్ ……….”
” పప్పా! హంతకులు,గజదొంగల్లాగా అతన్నెందుకు హాంగ్ చేస్తారు? అతని ప్రాణం తీయాలనుకుంటే ఎదురుగా కాల్చి చంపండి. గివ్ హిమ్ ఎ సోల్జర్ డెత్ .”
ఖిన్నుడయ్యాడు, గ్లాడ్ సాబ్ నిరుత్తరుడయ్యాడు. కూతురు మాటలు అతనికి నచ్చాయి. ఓ తేజస్వి, క్రాంతివీరుడిని దొంగలా ఉరికంభం ఎక్కించాలంటే అతనికి కూడా నచ్చలేదు. కానీ తను నిస్సహాయుడు, తను ఈ విషయంలో ఏమి చేయలేడు.
……. ……. …….. ……… …….. ………………. ………………… ………………. …….. ” జీన్! యూ డోంట్ నో మై పొజిషన్. బట్ హి నోస్ …. ……. నోస్ దట్ ఐ యామ్ ఎ లిటిల్ పెట్టి బ్యూరోక్రాట్.”
దుఃఖంతో తల్లడిల్లుతున్న జీన్ దుర్భలుడయిన తండ్రి ఒళ్లో తల పెట్టుకొని చిన్న పిల్లలా ఏడుస్తూ ఉండిపోయింది
“……. …….. ఈ రోజు నిన్ను ఆఖరు సారిగా కలుసుకుందామని వచ్చాను.” అంది జీన్, వీరభూషణ్ పట్నాయక్ తో
“మంచిదే రేపు మీ పపా పర్మిషన్ ఇచ్చినా నీవు నన్ను కలుసుకోలేవు కదా?” నవ్వుతూ అన్నాడు పట్నాయక్. మృత్యువు నీడ కింద నక్సలైట్ ఖైదీ నవ్వు జీన్ గుండెను చీలుస్తోంది …… తను తెచ్చిన డిష్ మెల్లగా కటకటాల్లోంచి ముందుకు చాపింది. ఆ డిష్ ను అందుకుంటూ ఏమిటిది అంటూ అడిగాడు పట్నాయక్.
” ఏదో స్వీట్ …… ” అంటూ నసిగింది జీన్.
” మంచిదే కదూ ……. …….. చచ్చే ముందు నోరు తీపి చేసుకొని ప్రపంచం వద్ద సెలవు పుచ్చుకోవచ్చు.” అంటూ డిష్ పుస్తకాల దొంతర మీదుంచాడు.
చాలా సేపు అలా మౌనంగా గడిపారు ఇద్దరు. జీన్ కేదో అడగాలనుంది. కానీ అడగలేకపోతుంది.ఏదో చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతోంది. ఎట్టకేలకు చివరి కేదో నిచ్చయించుకునట్టు,కొంచం తగ్గు స్వరంతో …..” నీకు నచ్చానా?” అంది జీన్.
” ఓహ్ నువ్వేవరికి నచ్చవు గనుక?” అన్నాడు పట్నాయక్ చిరునవ్వుతో.. ..
“మరయితే నా మాటొకటి వింటావా?”———-జీన్
“ఏమిటది?”——– వీరభూషణ్ పట్నాయక్ ప్రశ్న
” రేపు….. నిన్ను ……. నువ్వు……..ఉహూ , ఓ పదిహేను రొజులాగవూ ……… నాకోసం. ఆ తర్వాత మళ్లీ జన్మ ఎత్తి నా కడుపున పుట్టు. ఒక్క గుక్కలో అన్న జీన్ మాటలకు ఆశ్చ్చర్యంగా తలెత్తి ఆమె కేసి చూసాడు నక్సలైట్. ఆమె కళ్ళల్లో నీళ్ళు కదలాడుతున్నాయ్.
” నాకు నీ లాంటి బాబు కావాలి. నీ లాగే శూరుడూ, కవీనూ కేవలం నా కోసం ఓ పదిహేను రోజులాగవూ ” ఆమె కంఠంలో బుజ్జగింపు ఉంది, అర్దింపు వుంది.
నక్సలైట్, జీన్ కేసి చూడ లేక తలోంచుకున్నాడు.అతనికేమి మాట్లాడాలో తోచలేదు. అతని నిసితమయిన తెలివి తేటలు జీన్ కోమలమయిన భావాల ముందు ఎందుకు పనికి రాకుండా పోయాయి. అతడేమి మాట్లాడ లేక పోయాడు. కొంచం సేపు మౌనం తర్వాత జీన్ తన రెండు చేతులూ కటకటాల్లోనించి లోనికి పోనిచ్చి అతని తల ఎత్తి గద్గద కంఠంతో మళ్లీ అర్దించింది ” నేను నీకు నచ్చాను కదూ?”
నక్సలైట్ వీరభూషణ్ పట్నాయక్ గుండె బరువెక్కింది.అతని నోటెంట ఒక్క మాట కూడా బయటకు రాలేదు. కేవలం అలాగే అన్నట్టు తలూపాడు. దానికే సంబర పడిపోయింది జీన్. అతన్ని దగ్గరకు లాక్కొని అతని తలను తన గుండెలకు హత్తుకొని చంటి పాపను ముద్దెట్టుకున్నట్టు గబగబా ముద్దుల వర్షం కురిపించసాగింది. “ఎదురు చూస్తా నాన్నా నీ కోసం ఎదురు చూస్తా” నంటూ పిచ్చిగా గొనుక్కోసాగింది……….
         మిత్రులారా! ఈ పైన పేర్కొన్న సన్నివేశాల పరంపర మరాటీలో అనిల్ బర్వె వ్రాసిన ” థాంక్యు మిస్టర్ గ్లాడ్ ” నవలలోనివి. అనువాదకురాలు శ్రీమతి కె.సుజనాదేవి గారు.అమరుడు అనిల్ బర్వె ఈ నవల వ్రాసి ధన్యత చెందారు. ఆయనకు జోహార్లు. అనువాదం చేసిన సుజనదేవి గారు తెలుగులో అనువాద సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. ఆమెకు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ తెలుగు సాహిత్య చదువరిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

Tuesday, June 21, 2011

మృత్యుపత్రం ( వీలునామా )

"సర్ ఖైదీ నం.842 (ఉరిశిక్ష పడిన నక్సలైట్ ఖైది)ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా పేరిట మృత్యుపత్రం రాస్తానంటున్నాడు". అని సీనియర్ జైలర్, జైలు సూపరిన్ టెన్ డెంట్ కు సాల్యూట్ చేసి విన్నవించుకున్నాడు..........
ఆలకించిన జైలు సూపరిన్ టెన్ డెంట్ తల కిందకి పైకి ఆడించి "సరే ఆఫీసు టయిము అయిపోయాక టైపిస్ట్ ను, ఆ సరంజామాను తీసుకొని ఫాసీ గేటు వద్దకు రా ..."
.....గంటకోట్టగానే ఫాసీ గేటు జైలర్,సీనియర్ జైలర్,ఇద్దరు హవల్దార్లు,నలుగురు వార్డర్లు,ఓ టైపిస్ట్,ఓ టేబుల్,పెట్రోమాక్స్ లైట్,రెండు కుర్చీలు తీసుకొని జైలు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ సాబ్ ఫాసి గేటు కేసి వచ్చాడు.
వీరిని చూసిన ఖైదీ .." హ్యావ్ ఏ సీట్ మిస్టర్ గ్లాడ్" అన్నాడు వీర భూషణ్ పట్నాయక్ ( ఖైది నం.842 )..........
"కెన్ ఐ డిక్టేట్ నౌ ?" అన్నాడు తిరిగి ............ " యస్ ....యస్ .... గొణిగాడు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ .
..........దేశపు ఈనాటి నిరంకుశ ప్రభుత్వపు నామ మాత్రపు అధ్యక్ష మహాశయునికి!
మహాశయా!
రాజమండ్రి సెంట్రల్ జైలులో మీ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష కై ఎదురు చూస్తున్న నేను ...... ఖైది నం.842 వీర భూషణ పట్నాయక్ ను మరొక్కమారు ఆత్మాభిమానంతో మీకు తెలియజేయు అంశాలు:
నేను కమ్యూనిస్ట్ ను,మార్క్స్,లెనిన్,మావోల సిద్ధాంతాలు, ఆలోచనల పైన నాకు అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం.నా దేశపు నాతోటి సోదరులు, మీ నిరంకుశ ప్రభుత్వ కఠోర కబంద హస్తాలనుండి కేవలం శస్త్రకాంతి వల్లనే విముక్తులు కాగలరని నా అచంచల విశ్వాసం.అందుకే శ్రీకాకుళం ఉద్దానంగిరిజన ప్రాంతాలలో నేను,నా సహచరులు చేసిన అసఫల ప్రయత్నం సరయినదే అని మళ్ళి మళ్ళి నొక్కి చెప్పటానికి నేను గర్విస్తున్నాను.

మీ ఆయుధఫాణులయిన సైనిక బలగాలు మాలాంటి క్రాంతి వీరుల చిన్న సమూహాలపయిన సాధించిన విజయం ఓ కొత్త శారిత్రను సృష్టిస్తుంది. ఈ తాత్కాలిక పరాజయంతో మా కామ్రేడ్స్ నీతి,ధైర్యం ఏమాత్రం సన్నగిల్లలేదు,అడుగంటలేదు. ఒక్క మాట ఈ సందర్భంగా ' కేవలం విజయగర్వంతో కాదు మానవచరిత్ర మొదలయింది.సమర్పిత దారుణ పరాజయాల పరంపర నుండి. ఈ చరిత్ర అప్పటినుండి ఇప్పటికీ అలాగే నడుస్తుంది.ఇది మాకు తెలుసు చరిత్ర అధ్యయనం చేస్తే మీకూ అవగతం కాగలదు.
...........అందుకే ఈనిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలలో ఒకడిగా నేను ప్రాణ యాచన చేయను గాక చేయను, చేయబోను. నేనే గనుక అలాచేస్తే కష్టించి నిజాయతీతో పనిచేసే నాతోటి క్రాంతి సోదరుల శక్తి యుక్తులను అవమానించినట్లే.అంతేకాదు మాలాంటి ప్రజలను పీల్చి పిప్పిచేసే ప్రభుత్వాన్ని గౌరవించినట్లు,సన్మానించినట్టు అవుతుంది.అయినా మీ న్యాయస్థానం విధించిన శిక్ష మాత్రమే మీరు నాపట్ల అమలు పరచాలని,అన్నిటికన్నా ముఖ్యం నా సంపద వాటిపయ్ మీకూ ఎలాంటి హక్కు లేనందున, నానుంచి మీరు నాసంపదను లాక్కోవద్దని కోరుతున్నాను.

నేను కమ్యునిస్టును,మా సిద్ధాంతం ప్రకారం శ్రమయే మాధనం.ఆ శ్రమకు సాధనం శరీరం కాబట్టి శరీరం కూడా మానవుని వ్యక్తిగత ధనంలో ఓ భాగం. ఆ ధనాన్ని తన వారసులకివ్వడం నేటి మీ రాజ్యాంగం పరంగా చూసినా ప్రతి మనిషికి చట్టపరంగా ఉన్న హక్కు అన్న విషయాన్ని మీకు మరో మారు గుర్తు చేస్తున్నాను. ఆ నాహక్కును నేను వినియోగించుకోవడానికి నాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను.
........ టైపిస్టు నిర్వికారంగా టైపు చేస్తున్నాడు.... గ్లాడ్ సాబ్ మాత్రం ఎన్నడూ,ఎవ్వరూ కనీ వినీ ఎరుగని ఈ మృత్యు పత్రాన్ని వింటూ తన్నుతాను మరచిపోతున్నాడు.ఇవేమీ పట్టనట్టు ఖైదీ నం 842 వీర భూషణ పట్నాయక్ డిక్టేట్ చేస్తున్నాడు.
మీ ప్రభుత్వానికి,మీ న్యాయస్థానానికి కావలసింది కేవలం నా ప్రాణం. నా ధనంతో మీ కేమి పని లేదు.అలాంటప్పుడు నన్ను ఉరితీసి,ఆతర్వాత పోస్ట్ మార్టం చేసి నా శరీరాన్ని ( నా ధనాన్ని ) నాశనం ఎందుకు చేస్తారు? అలాగయితే నా శరీర సంపదను ఎవరికీ ఉపయోగించని విధంగా నేను నా సంపద (శరీరం) కోల్పోతాను.నాదేశ ప్రియ భాంధవులకోసం,నా ప్రియమయిన కార్మిక,కర్షక సోదరులకోసం నా శరీరంలోని ఆణువణువూ ధారపోయాలన్నదే నా ఆశ,ఆకాంక్ష.అందుకే మీ ప్రభుత్వానికి,మీకు తెలియపరుస్తూ,నా ఆశయసాఫల్యతకు సహకరించ వలసిందిగా కోరుచున్నాను.కనీసం మీ రాజ్యాంగంలోనే నాకున్న హక్కును,గౌరవించి నా కోర్కె సాఫల్యతకు సహకరించండి...... నన్ను ఉరితీసి నా శరీరాన్ని పోస్ట్ మార్టం చేసి ఎందుకు ఎవరికి ఉపయోగపడకుండా నా కాయాన్ని అవతల పారేయడం,అదే ఖననం చేయడమో,కాల్చి బూడిద చేయడమో చేయకండి.అందుకు బదులుగా నిపుణులయిన వైద్యుల పర్యవేక్షణలో నేను జీవించి ఉండగానే నా శరీర అవయవాలు, కళ్ళు,కిడ్నీలు,లివర్,గుండె,ఊపిరితిత్తులు,రక్తం,మూలుగు,ఎముకలు,ప్రేగులు,ఎలా ఏవి పనికి వస్తాయో అవన్నీ తీయించి వాటి అవసరం గల పేదరోగులకు ఉపయోగించండి.ఈ ప్రక్రియలో నాలో చలనం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు నేను చనిపోయినట్లు ప్రకటించండి.

........గ్లాడ్ సాబ్ జేబులోంచి విస్కీ సీసా తీసి తనకు తెలియకుండానే నక్సల్ ఖైదీ ముందుకు చాపాడు. వీర భూషణ్ పట్నాయక్ వద్దన్నట్టు తల అడ్డంగా ఊపగానే సీసా తన గొంతులో కొంత వంపుకొని మూతబిగించి జేబులో పెట్టుకొని ఆసక్తికరంగా వింటున్నాడు ఖైదీ వీలునామాని.
ఇతరులకు ఉపయోగపడే అన్ని అవయవాలు తీసాక,ఎవరికి,ఏవిధంగాను పనికిరాని నా మిగిలిన శరీరాన్ని ఎవరికి కష్టం కాని విధంగా, కాల్చో,ఖననం చేసో ఏదోవిధంగా చిద్రం చేయండి.అంతేగాని ఏవిధమయిన ధార్మిక సంస్కారాలు నా శరీరానికి జరపవద్దని కోరుకుంటున్నాను.ఇకపోతే ఈ దేశంలోని ఏప్రాంతం వాడయినా,ఏ ధర్మం వాడయినా,ఏజాతి వాడయినా, నా శరీరం నుండి సేకరించిన అవయవాలతో అవసరం పడితే స్వేచ్చగా ఏవిధమయిన ప్రతిఫలం ఎవరికి చెల్లించకుండా పూర్తి ఉచితంగా పొందవచ్చు. అయితే ఒక షరతు నా శరీరంలోని ఏ అవయవమయినా కావలసిన వారిలో ముందుగా భూమిలేని పేద రైతు కూలీలకు,గిరిజనులకు,ఆకుసలరు అయిన చిన్న కార్మికులకు,అ తదుపరి శ్రామికులకు,సన్నకారు రైతులు,స్వతంత్ర కార్మికులు, చిన్న సైజు కుటీర పరిశ్రమలవారికి,ఆ తర్వాత బుద్ధిజీవులయిన,ఉపాధ్యాయ,అధ్యాపక,డాక్టర్,ఇంజనీర్లకు,కళాకారులకు,ఇతరేతర ఏ మధ్యతరగతి బుద్ధిజీవికయినా వినియోగించవచ్చు.నా ఈ ప్రాధాన్యతా క్రమంలో ఎవరికి అవసరం లేని పక్షంలో దేశంలోని ఏ పేద వ్యక్తి కయినా, యాచకులకయినా ఉచతంగా నా శరీర అవయవాలను వినియోగించ వచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను,భారీపరిశ్రమ పెట్టుబడిదార్లకు,భూస్వాములకు,జమిందార్లకు,ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో వున్నా అధికార్లకు, మంత్రులకు,పోలీసు,మిలటరీ, ఏరాంకువాడికయినా నా అవయవాలు వినియోగించవద్దని ప్రత్యేకంగా కోరుచున్నాను.మీ ప్రభుత్వం నా ఈ అభీష్టాన్ని,హక్కును సరిగా అర్ధం చేసుకొని గౌరవిస్తదని,సరిగా ఆలోచించి,అమల్లో పెడతారని,నా పేద సోదరులకు నా ఆణువణువూ ఉపయోగపడే విధంగా,నా ఆలోచనాపరంగా తగు రీతిలో నా శరీర సంపద ఉపయోగ పడుతుందని అందుకు సహకరిస్తారని ఆశిస్తాను. రాష్ట్రపతిగా మీరు స్వయంగా ఈ నా శరీర సంపద వినియోగ విషయంలో జోక్యం చేసుకొని నా అభీష్టానికి సహకరించండి.

ఈ విషయంలో అవసరం అయితే చట్టంలో ఏవయినా మార్పులు చేయవలసి వచ్చినా ఆ చట్ట సవరణలు చేసయినా నా సంపద పై నాకువున్న సహజ అధికారాన్ని నన్ను వినియోగించుకోనిమ్మని కోరుతూ,తమ నిర్ణయాదికారానికై,ఎదురు చూస్తుంటాను........ టైపిస్ట్ ఆగగానే సీనియర్ జైలర్ ముందుకొచ్చి పేపర్స్ అన్ని సరిగా నాలుగు సెట్లుగా సర్ది పిన్ చేసి ఖైదీ నం:842 కు అందించాడు.అతడోసారి చదివి పూర్తి సంతృప్తితో సంతకం చేసాడు.జైలర్ వాటిని భద్రంగా తీసుకొని గ్లాడ్ సాబ్ కు అందించాడు వినయంగా. "ఖైదీ నా సమక్షం లో ఎవరి వత్తిడి లేకుండా వ్రాసాడని" సర్టిఫై చేసి సంతకం చేసాడు.జమేదార్ కుర్చీ తీసుకేల్లుతున్నాడు,గ్లాడ్ బయటకు వెళ్లబోయే వాడల్లా ద్వారం వద్ద ఆగి ఓ క్షణం ఖైదీ కేసి నఖ శిఖ పర్యంతం పరిశీలించాడు.ఒకఆడుగు ఖైదీ కేసి వేసి చేతిలోని క్యాప్ స్టన్ సిగరెట్ టిన్ నక్సలైట్ కేసి చూపుతూ అన్నాడు " డూ యూ లైక్ ఇట్ ".
ఏదో గొణుక్కుంటూ పట్నాయక్ ఓ సిగరెట్ అందుకున్నాడు. వెంటనే పూర్తి టిన్ను ఖైదీ చేతిలో ఉంచుతూ "కీప్ ఇట్ విత్ యూ "అంటూ గ్లాడ్ సబ్ బయటకు నడిచాడు...................
మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈ మృత్యుపత్రం(వీలునామా) ను మరాటి లో అనీల్ బర్వే వ్రాసిన'థాంక్ యు మిస్టర్ గ్లాడ్' కు శ్రీమతి కె.సుజనాదేవి తెలుగు సేతలో చదివాను. నన్ను ఉద్విగ్న పరచింది ఈ రచన దాంతో మీకు కూడా పరిచయం చేయాలనిపించి మీ ముందుంచుతున్నాను. నాద్రుస్టిలో అనీల్ బర్వే ఇప్పుడు లేడు కాబట్టి ఈ రచనతో ఆతని జన్మ ధన్యమయినదని భావిస్తూ అతనికి జోహార్లు చెప్పుతున్నాను.ఇకపోతే సుజనాదేవి గారు ఈ నవలను తెలుగు చేయడం ద్వారా ఆమె తెలుగు రచనా రంగానికి యెనలేని సాహితీ సేవ చేసారని భావిస్తూ ఆమెకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. .........