Friday, January 16, 2015

అర్జునుని సందేహం

*********************************** అర్జనుని సందేహం *******************************
హస్తినాపురం లో  ద్రోణాచార్యుని వద్ద  పాండురాజు కుమారులూ, దుర్యోధనాదులూ చదివే రోజుల్లో
ఒకరోజు సాయంకాలం వేళ  వాహ్యాళి నుంచి వస్తూ అర్జునుడు  కర్ణుని  చూసి  "  ఏం  కర్ణా!
సమరం మంచిదా?  శాంతి మంచిదా? " అని అడిగాడు. ( ఇది  మహాభారతం లోని ఒక ఉప కధ;
శాస్త్ర ప్రమాణం కలది; వట్టి అభూత కల్పన కాదు. )
           ' శాంతి మంచిది ' అన్నాడు  కర్ణుడు.  కారణం? అని కిరీటి అడిగాడు.
' ఏమోయ్  అర్జునా, యుద్ధం కనుక వస్తే, నేను నీతో పోరాడాలి. అందువల్ల నీకు ఇబ్బంది  నాదేమో
జాలి గుండె. నీకు కనక కష్టం కలిగితే నేనది చూసి సహించలేను. కనక మన ఇద్దరికి కష్టం కలుగుతుంది. అందువల్ల శాంతి మంచిది' అని కర్ణుడు చెప్పాడు.
అర్జునుడు ఇలా అన్నాడు " కర్ణా! మన ఇద్దరిని మనస్సులో ఉంచుకుని నేనీ విషయం అడగలేదు
సాధారణంగా లోకంలో  యుద్ధం మంచిదా? శాంతి మంచిదా? అని అడిగాను"
    ఉమ్మడి విషయాలను గురించి ఆలోచించడం లో నా కంతగా అభిరుచి లేదు - అని బదులు చెప్పాడు  కర్ణుడు.
     వీణ్ణి చంపి పారేయ్యాలని అర్జునుడు తన మనస్సులో అనుకున్నాడు. ఆ తర్వాత అర్జునుడు
ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి అదే ప్రశ్న అడిగాడు.  " కలహం మంచిది " అన్నాడు ద్రోణుడు.
'ఎందుకు ? ' అని పార్ధుని ప్రశ్న.  అప్పుడు ద్రోణాచార్యుల వారు " నాయనా  విజయా! కలహం వల్ల
ధనము, కీర్తీ కలుగుతాయి. లేకుంటే మరణం కలిగుతుంది. శాంతి వల్ల అంతా సందేహమే......"      
   ఆ తర్వాత అర్జునుడు భీష్మాచార్యులవారి వద్దకు వెళ్ళాడు.
"తాతయ్యా! పోరు లాభమా?  పొందు లాభమా? " అని అడిగాడు. అప్పుడా వృద్ధుడు ఇలా బదులు
చెప్పాడు. " బిడ్డా,  అర్జునా!  శాంతే మంచిది  యుద్ధం వల్ల  మన క్షత్రియ కులానికి లాభం ఉంది ;
అయితే శాంతి వల్ల  లోకానికే లాభం."
          ' మీ మాట  న్యాయసమ్మతంగా లేదు ' అన్నాడు అర్జునుడు.  ' మొట్టమొదట కారణం చెప్పి,
ఆతర్వాత నిర్ణయాన్ని చెప్పాలి అర్జునా' అన్నాడు వృద్ధుడు.    ..........  "తాత గారూ, శాంతి వల్ల
కర్ణుడేమో పై మెట్టు లోను  నేనేమో కింది మెట్టులోను ఉన్నాము. యుద్ధం కనక వస్తే  నిజం
బయట పడుతుంది "  అన్నాడు అర్జునుడు.
            అందుకు భీష్మాచార్యులవారు, " నాయనా, ఎప్పుడు ధర్మానిదే పై చెయ్యి. యుద్ధం ఉన్నప్పుడు కాని లేనప్పుడు కాని ధర్మమే జయిస్తుంది. అందువల్ల నీ మనసులో కోపం చంపుకుని
శాంతిని కోరుకో, మానవులందరు తోదబుట్టినవారు, వారు పరస్పరం ప్రేమించుకోవాలి.
ప్రేమ తారకమంత్రం. ముమ్మాటికి చెబుతున్నాను  ప్రేమే తారకమంత్రం" అన్నాడు ఆయన
కళ్ళు చెమ్మగిల్లాయి.
           కొన్నాళ్ళ  తర్వాత వేదవ్యాసులవారు హస్తినాపురానికి వచ్చారు. అర్జునుడు ఆయన్ని
సమీపించి  " యుద్ధం మంచిదా?  శాంతి మంచిదా? " అని ప్రశ్నించాడు.
           'రెండూ  మంచివే,  సమయానికి తగినట్లుగా వ్యవహరించాలి' అని ఆయన చెప్పారు.
    చాలా సంవత్సరాల  తర్వాత మాట వనవాసం, అజ్ఞాత వాసం  చేసే రోజుల్లో దుర్యోధనాదుల
వద్దకు రాయభారం పంపించేందుకు ముందు అర్జునుడు శ్రీ కృష్ణుడ్ని  సమీపించి " యుద్ధం
మంచిదా? శాంతి మంచిదా? " అని అడిగాడు.
        అందుకు కృష్ణుడు - " ప్రస్తుతానికి శాంతి మంచిది, అందువల్లనే  నేను శాంతి  కోసమని
హస్తినాపురానికి  బయలుదేరుతున్నాను" అన్నాడట !
------------------------------------------------------------------సి. సుబ్రహ్మణ్య భారతి                        

Thursday, August 11, 2011

సత్యాన్వేషణ

అసతో మా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి: శాంతి: శాంతి:
అసతో మా సద్గమయ అశాశ్వతం నుంచి శాస్వతానికి అసత్యం నుంచి సత్యానికి సాగుదాం.
తమసోమా జ్యోతిర్గమయ తిమిరం నుంచి ప్రకాశానికి సాగుదాం
మృత్యోర్మా అమృతంగమయ మృత్యువు నుండి అమృతానికి సాగుదాం
అన్వేషణం - సత్యాన్వేషణయే జ్ఞానం

శాశ్వత సత్యంకోసం పయనమే జ్ఞానం
ప్రకాశం కోసం పయనమే జ్ఞానం
అమృతాన్ని వెదుకుతూ సాగడమే జ్ఞానం
అన్వేషణమే జ్ఞానం
జ్ఞానమే అన్వేషణ!
అన్వేషణమే జీవితం
జీవితమే అన్వేషణ!
అయితే అన్వేషణ అన్వేషణ కొరకేనా ? కాదు "సత్యం" కొరకు.
పెద్దలు జ్ఞాన సంపన్నులు "దాశరధి" గారికి నమస్క్రుతులతో ఆయన ఉవాచే అని తెలుపుకుంటున్నాను.

Saturday, July 30, 2011

ప్రణామాలు


ప్రజాక్షేత్రంలో......
సామాన్యుడిని సాహసిగా
నిలిపినవాడు
యుద్ధరంగంలో
గులకరాయిని బుల్లెట్ గా
...... మార్చినవాడు
సాహితీ క్షేత్రంలో
పైడికంటిని,గోగురిచ్చను
పరిచయం చేసినవాడు
చివరగా
పరాజితుడినే విశ్వ విజేతగా
రణరంగాన్ని మార్చినవాడు
ఏడీ!
ఆ మూర్తి...... సత్యమూర్తి
అతనికి నా దండ ప్రణామాలు.

Thursday, July 28, 2011

మహారాజు ---- గుడ్డివాడు

పూర్వం చోళ రాజ్యాన్ని ప్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.అతని తండ్రి అనంతుడు రాజ్యవిస్తరణ కాంక్షతో చోళ రాజ్యం చుట్టు పక్కల వున్న చిన్న చిన్న రాజ్యాలనన్నిటిని యుద్ధంలో జయించి తన రాజ్యంలో కలిపేసుకున్నాడు.చోళ రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా చేసాడు అనంతుడు.కొంత కాలం గడచినా తర్వాత వ్రుద్దాప్యంతో అనంతుడు కాలం చేసిన తర్వాత  ప్రసేనుడు అధికారంలోకి వచ్చాడు.ప్రసేనుడు కూడా రాజు అయిన కొత్తలో అనేక యుద్దాలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు.ఆ తర్వాత ప్రసేనుడు యుద్దాలు ఆపి తన సామ్రాజ్యంలో పరిపాలన పటిష్టం చేయడానికి కృషి జరపనారంభించాడు
                 ఒకరోజు ప్రసేనుడు తన సామంతులతోనూ,మంత్రి,సైన్యాదక్షుడితో కలసి,వంది మాగతులతో నిండుగా కొలువుతీరి సామ్రాజ్యంలో విశేషాల గురించి తెలుసుకుంటున్నాడు,సరిగా ఆ సమయంలో ఓ పుట్టి గుడ్డివాడొకడు - ఆదుకోండి చక్రవర్తి,ఆదుకోండి.నన్నాదుకుంటే ఆ భగవంతుడు మిమ్ములను ఆదుకుంటాడు.మహారాజా ఆదుకోండి! నేను పుట్టుగుడ్డివాడిని,నా బతుకు మరీ దుర్లభముగా వుంది.మీరే నన్నాదుకోవాలి,నాకేదో ఒక దారి చూపాలి అంటూ వేడుకున్నాడు. నిండు పెరోలగంతో వున్న మహారాజు ప్రసేనుడు ఒక్క క్షణం ఆలోచించి తన ఔదార్యాన్ని ప్రకటించుకోవడానికి ఈ సన్నివేశం బాగానే ఉంటదని తలచి, అలాగే కానీ రాజాశ్రయం పొందాలంటే నీకేదన్న విశిష్టత వుండాలి కదా,కేవలం అంగ వైకల్యం ఒక్కటే సరిపోదు కదా?నీకేవన్నా విద్యలు తెలుసా? కనీసం వేటిలోనన్నా ప్రవేశమన్నా ఉందా? అని ప్రశ్నించాడు ప్రసేనుడు. అంతట గుడ్డివాడు - మహారాజా! నాకు వజ్రాల గురించి కొంత శాస్త్రం తెలుసు,అలాగే అశ్వాల గురించి కూడా కొంతవరకు తెలుసు అన్నాడు.మహారాజు ప్రసేనుడు ఆహా! అలాగా అయితే నీకు నెలకు ఒక వర ఇస్తాము మా ఆస్థానములో వుండు.అని నిండు సభలో ప్రకటించి సభికుల అందరి ప్రశంసలు అందుకున్నాడు ప్రసేన మహారాజు.                   
కొంత కాలం గడిచింది.ఒకనాడు మహారాజు ప్రసేనుడు కొలువుతీరి వున్నాడు. నిండు సభలోకి నలుగురు గ్రామీణులు ప్రవేశించి మహారాజ! మేము పొలంలో పని చేస్తుండగా ఒక వజ్రం దొరికింది.దానిని మన రాజ్యంలోని  వజ్ర వ్యాపారులు కొనలేము ఇది మహాప్రభువులు తప్ప ఎవరు కొనలేరు అని చెబుతున్నారు,తమరు ధర్మప్రభువులు మీరు ఈ వజ్రాన్ని తీసుకొని మాకు సముచిత పైకం ఇవ్వగలరు అని వేడుకున్నారు.అంతట ప్రసేనుడు, నగరంలోని వజ్రాల వ్యాపారులను పిలిపించి ఈ వజ్రానికి సరయిన ధరనిర్ణయించ మని ఆజ్ఞాపించాడు. ఆతర్వాత కొద్ది సమయంలోనే ప్రసేనుడికి ,గుడ్డివాడు తనకు వజ్రాల విషయంలో కొంత పరిజ్ఞానం వుందని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి,అతనిని ప్రవేసపెట్టమన్నాడు. బటులు గుడ్డివాడిని దర్భారులోకి తీసుకువచ్చారు.మహారాజు - ఏమోయి నీకు వజ్రాల విషయం తెలుసునన్నావు గదా అదిగో ఆ వజ్రం విషయంలో నీ అభిప్రాయం చెప్పు అన్నాడు.దానికి గుడ్డివాడు - మహాప్రభో ఆ వజ్రాన్ని నాచేతిలో పెట్టమనండి,అలాగే ఆ వజ్రం గురించి పైకి కనిపించే విశేషాలు నాకు చెప్పమని వజ్రవ్యాపార ప్రముఖులతో చెప్పండి అన్నాడు.అందుకు ప్రసేనుడు ఆవిధంగా చేయమని ఆజ్ఞాపించాడు. వ్యాపారులు ఆ వజ్రం విశేషణాలు,వన్నెలు,ఇతేరేతర వివరణలతో చేభుతున్నారు గుడ్డివాడు ఆ మాటలు వింటూనే వజ్రాన్ని ఆచేతిలోనించి ఈ చేతిలోకి అటు ఇటు పదే పదే  మారుస్తున్నాడు.ఆ విధంగా మార్చి మార్చి మహాప్రభో ! ఈవజ్రం ఎక్కడ వుంటుందో అక్కడ అరిష్టం వుంటుంది, దరిద్రం తాండవిస్తుంది.ఇది కొనరాదు అన్నాడు.అప్పుడు ప్రసేనుడు -నీవు ఏమి మాట్లాడుతున్నావు,ఇందరు వజ్ర వ్యాపార ప్రముఖులకు తెలియని విషయం నీకు ఒక్కడికే తెలిసిందా?ఏమిటి దానిలోని లోపం నీవు సరిగా చెప్పకపోతివా నీ అవాకులు చెవాకులకు నీకు కటిన శిక్ష విధించవలసి వుంటుంది.జాగ్రత్త అన్నాడు.దానికి గుడ్డివాడు - మహారాజ మీ ఉప్పుతిని బతుకుతున్నవాడిని మీ ముందు నేను సత్యం తప్ప వేరేది చెప్పలేను ఈ వజ్రాన్ని మధ్యకు కోస్తే  తేలుతుంది దీని మధ్యలో చిన్న కప్పవుంది.ఇది అరిష్టం నిజం తేల్చండి.నేనయితే చెప్పింది తప్పని తేలితే ఏ శిక్ష కయినా సిద్దం అన్నాడు.రాజాజ్ఞ మేరకు వజ్రాన్ని కోయిన్చాగా గుడ్డివాడు చెప్పింది అక్షర సత్యంగా తేలింది.ప్రసేనుడు గుడ్డివాడిని మెచ్చుకొని అతనికి ఈ నెల నుండి మరో వర అదనంగా ఇవ్వమని ఆజ్ఞాపించాడు.దానికే గుడ్డివాడు మహా ప్రభువుల దయ అంటూ సంతోషంగా బటుల  సాయంతో దర్బారు నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
     ఆవిధంగా ప్రసేన మహారాజు ఆస్థానంలో గుడ్డివాడు తన బతుకును కొంతవరకు సంతృప్తిగా కొనసాగిస్తున్నాడు. ఒకరోజు మహారాజు దర్బారుకు గుడ్డివాడిని బటులువచ్చి తీసుకు వచ్చారు.ఆ సమయంలో కొందరు గ్రామీణులు ఒక తెల్లని గుర్రాన్ని తీసుకు వచ్చి మహారాజ! తమ వంటి ధర్మ ప్రభువుల ఆశ్వశాలలో ఉండవలసిన మేలుజాతి అశ్వం ఒకటి మాదగ్గర వుంది. తమరు ఈ ఆశ్వ రాజాన్ని తీసుకొని ధర్మప్రభువులు మాకు తగు పారితోషికం ఇవ్వమని ప్రాదేయపడుతున్నారు.అప్పుడు ప్రసేనుడుకి,గుడ్డివాడు తనకు ఆశ్వ శాస్త్రం తెలుసు అన్న విషయం గుర్తొచ్చి పిలిపించాడు. ... గుడ్డివానితో... మహారాజు ...యోమోయ్,బాగున్నావా,నీకు సరయిన ఆదరణ లభిస్తుందా?అని కుశల ప్రశ్నలు వేసి, సరే విషయానికి వస్తే మరల తిరిగి నీకొక పరీక్ష ఇప్పుడు మన దర్బారుకి ఒక గుర్రాన్ని తీసుకు వచ్చారు గ్రామీణులు.ఆ గుర్రాన్ని తీసుకొని సముచిత పారితోషికం  ఇవ్వమని వారు అడిగుతున్నారు.నీకున్న ఆశ్వ శాస్త్ర పరిజ్ఞానంతో నీ అభిప్రాయం విన్న తర్వాతే ఆ గుర్రాన్ని తీసుకుందామని భావించి నిన్ను పిలిపించాము.నీ అభిప్రాయాన్ని తెలుపు అని ఆజ్ఞాపించాడు మహారాజు.దానికి గుడ్డివాడు - మహారాజు గారికి నాపట్ల వున్నా అభిమానానికి,నమ్మకానికి మొదట కృతజ్ఞతలు.మహారాజా! నాకు ఆ అశ్వం ఎత్తు వన్నె దాని సుడులు,కాలి ఎత్తు,గుర్రం పొడవు,తోక బారు,కన్ను తీరు,ముఖ కవళికలు తదితరవివరాలు చెప్పమని ఆదేసించండి,అలాగే ఆ గ్రామీణులను,నాతో మాట్లాడమని కూడా చెప్పండి.అని అడిగాడు.బటులతో తనను ఆ గుర్రం వద్దకు తీసుకెళ్ళమని కోరాడు.ఆవిధంగా గుర్రం వద్దకు వెళ్ళిన గుడ్డివాడు ఆ గుర్రం చుట్టూ తిరుగుతూ....గ్రామీణులను మీరు ఏమి వృత్తి చేస్తుంటారని అడిగి వివరాలు తెలుసుకున్నాడు.తరవాత మహారాజా! ఇది చూపులకు గుర్రమే కానీ,రణ క్షేత్రానికి పనికిరాదు.దీనిమీద యుద్ధానికి వెళ్ళినవాడు పరాజయం పాలవడమే కాక,కనీసం ఆ యోధుడి మృత దేహాన్ని కూడా ఇది తీసుకురాదు.యుద్ధానికి పనికి రాని గుర్రం ప్రభువుల ఆశ్వ శాలకు భారమే కానీ యోగాదాయకం కాదు అన్నాడు. అదేమిటి గుర్రం బాగానే వుంది కదా నీవు అల ఎలా చెప్పగలవు అన్నాడు మహారాజు. అంతట గుడ్డివాడు __ మహారాజా! ఇది పుట్టుకతో గుర్రమే కానీ దీనిని కన్నా తర్వాత తల్లి గుర్రం చనిపోయింది.ఇది పుట్టినప్పటినుండి దీనికి ఈ గ్రామీణులు గాడిద పాలు పట్టారు.ఇది గాడిద పాలు తాగి పెరిగింది.,దీనికి కొన్ని ఆ లక్షణాలు వచ్చాయి అన్నాడు.అందువలన దీనిని మహారాజులు తీసుకోవటం శ్రేయస్కరం కాదు.ఆ తర్వాత ఆ గ్రామీణులు ఆ మాట వాస్తవమే ఇది గాడిద పాలు తాగి పెరిగినదే అని అంగీకరించారు. దానితో ప్రసేన మహారాజు సంతోషించి,ఈ నెల నుండి మరో వర అదనంగా చెల్లించమని హుకుం జారీ చేసాడు.గుడ్డివాడు ధర్మ ప్రభువుల దయ అన్నాడు. అయితే మహారాజులో కుతూహలం పెరిగి గుడ్డివాడిని నీకు ఇంకా ఏయే విషయాలలో ప్రవేశం వుందో తెలుసుకోగోరుతున్నాను అన్నాడు.అంతట గుడ్డివాడు మహా రాజ నాకు కొంతవరకు స్త్రీల విషయంలో కూడా ప్రవేశం వుంది అన్నాడు.ఆహా! సంతోషం, తర్వాత కలుసుకుందాం అన్నాడు మహారాజు.తర్వాత గుడ్డివాడిని బటులు అతని ఆశ్రయానికి,తీసుకెళ్ళారు. కానీ దర్భారు ముగుంచి వెళ్ళిన మహారాజుకు గుడ్డివాని పట్ల ఆసక్తి పెరిగి అతనిని తన రాజ మందిరానికి పిలిపించాడు.అతనితో ఏకాంతంగా మాట్లాడుతూ తన చిన్న రాణీ విషయం నీవు స్వయంగా నాకు తెలియజేయాలి అందుకు నీకు కావలసిన ఏర్పాట్లు చేయిస్తాను,కానీ ఇది ఇతర్లకు తెలియరాదు.జాగ్రత్త అని హెచ్చరిస్తాడు.దానికి గుడ్డివాడు-- మహారాజ నేను చిన్నా రాణిగారి ఏకాంత మందిరానికి వెళ్ళాలి.ఆమెతో నేను మాట్లాడాలి.ఆ సమయంలో ఆ భవనంలో ఏఒక్క ఆడ గాని మగ కానీ మనిషే కాదు జంతువులు,పక్షులు కూడా ఉండరాదు,కనీసం ఏ పురుగు కూడా ఉండటానికి వీలులేదు అందుకు మీరు ఉత్తర్వులు జారీ చేయండి. అప్పుడు నన్ను చిన్న మహారాణి గారి మందిరంలో ప్రవేశపెట్టి కూడా వచ్చిన బటుడిని వెనక్కు వెళ్లేటట్టు చర్యలు తీసుకోవాలి.ఆ తర్వాత సరిగ్గా పది నిముషాలకు మరల ఆ బటుడు వచ్చి నన్ను తీసుకు రావాలి.తగు ఏర్పాట్లు చేయమని కోరాడు గుడ్డివాడు.ప్రసేనుడు ఆ విధమయిన చర్యలు తీసుకోమని ఆంతరంగిక సిబ్బందిని ఆదేశించాడు.ఆ ప్రకారం చిన్న రాణి గారి ఆంతరంగిక మందిరంలోనికి గుడ్డివాడు ప్రవేశించాడు. ప్రవేశించిన గుడ్డివాడు -- చిన్న రాణి గారితో  అమ్మ నేను పుట్టు గుడ్డివాడిని ఇదిగో నాకళ్ళు చూడండి అని కను రెప్పలు ఎత్తి రెండు కళ్ళు చూపించాడు.రెండు లోట్టలే,తమరు ధర్మ దేవతలు, నా ఎదురు మీరు వస్త్రాలతో వున్నా వస్త్రాలు లేకుండా వున్నా నాకు ఎతేడాను వుండదు. నాకు ఏదీ  కనిపించదు,అయితే శాస్త్రం కోసం నా మీద దయతో,తమరు శరీరం మీద ఏ ఆచ్చాదన లేకుండా,ఆభరణాలు కూడా తీసివేసి పుట్టినప్పుడు ఎలా శిశువు వుంటుందో అలా పూర్తిగా దిసమొలతో ఒక్క క్షణం నిలబడమని కోరుతున్నా అమ్మా! తర్వాత మీ శరీరం మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు వున్నాయో చెప్పి, మీరు తిరిగి మీ అలంకరణ చేసుకోవచ్చు.అమ్మా! ఇదంతా శాస్త్రం కోసమే తల్లి,రాజు గారి ఆజ్ఞ మేరకు నేను వచ్చాను.నేను పుట్టు గుడ్డివాడిని,నా విషయం లో ఏవిధమయిన సందేహం వలదు తల్లీ అన్నాడు. అంతట ఆ చిన్న రాణి మహా రాజు ఆజ్ఞ,ఇతను గుడ్డివాడి ఇంకేమి ఆలోచించకుండా ఆ విధంగానే చేసింది.తల్లి నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.తల్లి నేను వెళతాను,అని బటుల సాయంతో తిరిగి మహా రాజ ప్రసేనుడు వద్దకు రాజ మందిరానికి వెళ్ళాడు.ఏమోయ్ విషయం చెప్పు నీ అభిప్రాయం తెలుసుకోవాలని చాలా కుతూహలంగా వుంది అన్నాడు. అంతట గుడ్డివాడు........

---మహారాజా! నేను చెప్పే విషయం మీరు ఉద్రేకానికి లోను గాకుండా వినాలి.విషయం కేవలం తెలుసుకోవడానికే కానీ,విమర్సించుకోవడానికి కాదు అని గ్రహించాలి.ధర్మ ప్రభువులు సూక్ష్మ కుశాగ్ర బుద్ధితో విషయాన్ని గ్రహించాలి అంతే అంటూ .....మహారాజా  తమరి చిన్న రాణి గారు క్షత్రియ మహిళ కాదు, ఆమె దాసీ కూతురు,ఈ విషయంలో మీరు మీ అత్తగారినుండి పూర్తి  సమాచారాన్ని తెలుసుకోగలరు అన్నాడు. అంతట మహారాజు ఈ విషయంలో తేడా ఏమన్నా వుంటే మాత్రం నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది జాగ్రత్త,అంటూ విషయ సేకరణకు అత్తగారి దేశానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని వెళ్ళాడు ప్రసేనుడు.
            ప్రసేనుడు ........అత్తగారితో .....నా చిన్న రాణి నీకూతురు కాదా,నాకు వివరంగా చెప్పమని,అల్లుడుగానే కాకుండా నీదేశానికి కూడా మహా రాజునే ఆ హోదాతో కూడా ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అంతట ఆమె, నేను నీకు ఆ అమ్మాయి నా కూతురు అని చెప్పి మీ వివాహం చేసామా? నీవు మా రాజ్యం మీద దండెత్తి మమ్ములను వోడించి మా రాజ మందిరాన్ని స్వాదీనం చేసుకొని, నా ఆంతరంగిక మందిరంలో వున్న ఆ పిల్లను నాకూతురుగా బ్రమించి నీవు తీసుకుపోయి వివాహం చేసుకున్నావు,మేము నీ సామంతులుగా ఎదురు మాట్లాడలేక మిన్నకుండిపోయాము,ఇందులో మా తప్పేమిలేదు,ఆమె నాకూతురు కాదు,నాకసలు కూతుర్లె లేరు,ఆమె నా పుట్టింటినుండి వచ్చిన నా అరణపు దాసీ కూతురు.ఎర్రగాను,అందంగాను ఉండటంతో,నాకు కూడా ఆడ సంతానం లేకపోవడంతో దానికి నేను రాణి వాసాల్లోని మహిళలకు చేసి అన్ని అలంకరణలు చేయించి ఆనందిస్తుండే దానిని.నీవే కోరి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మమ్ములను నిందించడం మంచిదికాదు ప్రభువులకు అన్నది అత్తగారు కాని అత్త గారు.......ప్రసేనుడు తిరిగి తన రాజ మందిరానికి వచ్చి గుడ్డివాడిని పిలిపించి,అభినందించి ఈ నెల నుండి ప్రతి నెల అదనంగా మరో వర ఇచ్చే హుకుం జారీ చేసాడు.  

    ఆ విధంగా కొంతకాలం గడిచాకా ఒక రోజున గుడ్డివాని గురించి  మహారాజు ప్రసేనుడికి గుర్తుకొచ్చి అతనిని తన ఆంతరంగిక మందిరానికి పిలిపించుకొని, అంతరంగికంగా మాట్లాడుతూ, నా గురించి నీ అవగాహన ఏమిటి అని ప్రశ్నించాడు.దానికి గుడ్డివాడు --  తమరా మహా ప్రభూ ...తమరు ధర్మ ప్రభువులు అన్నాడు.అది కాదు, నన్ను గురించి నీ అవగాహన ఏమిటి అసలు నేను ఎవరిని నా గురించి నీకు తెలిసినది పొల్లు పోకుండా నిజం చెప్పు.ఇది దర్బారు కాదు.ఇచ్చట మనమిద్దరమే వున్నాము,వాస్తవాలే మాట్లాడుకుందాము.అబద్దాలు,ముఖస్తుతి మాటలు నాకు నచ్చవు. నీకు తెలిసినది తెలిసినట్లు,అనుకున్నది అనుకున్నట్టు చెప్పు,నిన్నేమి చేయను కానీ నాకు తర్కంతో నీ ఆలోచన కావాలి చెప్పు అని ఆజ్ఞ, హుకుం కాకుండా మహారాజు మొదటి సారి మిత్రునితో వ్యవహరిస్తున్నట్టు అడిగాడు.అంతట గుడ్డివాడు ఆ మిత్ర భందానికి లోనయినట్లు మహారాజా! నిజానికి మీరు క్షత్రియులు కాదు మీరు వ్యాపారస్తుల ( వణిక్ ) వర్ణానికి చెందినవారు.అయితే తమరు క్షాత్రము ( రాజ్యము ) కలదు కావున రాజులే,మహారాజులే అన్నాడు. అంటే అని ప్రసేనుడు ........ మహారాజా ఈ విషయంలో తమ తల్లి గారు అయిన రాణీ మాత మాత్రమే మీ సందేహాలను నివృత్తి చేయ గలరు అన్నాడు గుడ్డివాడు. అంతట కుతూహలం చంపుకోలేక ప్రసేనుడు తన తల్లి వద్దకు వెళ్లి తన జన్మ వృత్తాంతం చెప్పమని కోరగా ఆ రాణీ మాత ---నాయనా నీ తండ్రి గా చెప్పబడుతున్న అనంతుడు రాజ్యాభిశిక్తుడు అయి రాజ్యాన్ని విస్తరించాలనే కోర్కెతో చుట్టూ వున్న చిన్న రాజ్యాలపై దండెత్తి వోడించి తన రాజ్యంలో కలిపేసుకున్నాడు.ఆ విధంగా మాతండ్రి గారి రాజ్యంపయినా దండెత్తి మా తండ్రి గారి రాజ్యం కలిపేసుకొని నన్ను తన పట్టపు రాణి గా స్వీకరించి తీసుకువచ్చి తిరిగి మరలా యుద్దాలు చేయడానికి వెళ్లి రాజ్యాన్ని దశ దిసల విస్తరించాడు. అంటే గాని నన్ను ఏనాడు పట్టించుకోలా.ఒక రోజు నాకు కోర్కె కలిగి నేను చూస్తుండగా నాకు మన ఆస్థానంలో వుండే షరాబు గారు కనిపించారు ఆ సమయంలో నేను ఆయనతో కలిసాను, నీవు జన్మించావు.అందరికి నీవు మాత్రం మహారాజు అనంతుని బిడ్డవే.ఈ విషయం ఎవరికి ఆ షరాబు గారికి కానీ,మహారాజు అనంతుడికి కానీ తెలియదు అని నిజం చెప్పింది రాణీ మాత. 
        ఒకరోజు మహారాజు ప్రసేనుడు తన ఆంతరంగిక మందిరంలోనికి గుడ్డివాడిని పిలిపించాడు. ఏమోయ్ బాగున్నావా అని కుశల సమాచారం తెలుసుకొని, తర్వాత నాకు నీవద్ద నుండి కొన్ని వివరణలు కావాలి అందుకే నిన్ను పిలిపించాను.నాకు నీ బుద్ధి బలం పయిన నమ్మకం కుదిరినది. నీ పరిశీలనా శక్తీ పయినా విశ్వాసం వుంది.అయితే నాకు, నీవు ఏవిధంగా వజ్రం విషయం లోను,గుర్రం విషయం లోను,అటు ఇటు చూసి యెవరూ లేరని గ్రహించి చిన్న రాణి విషయం లోను,గుమ్మం వరకు వెళ్లి చూసొచ్చి నా జన్మవృత్తాంతం లోను, నీవు ఏవిధంగా చెప్పగలిగావో నాకు బోధపడటం లేదు. నీ వివరణ నన్ను సంతృప్తి పరచాలి.నీకు షరా మామూలుగా పారితోషికం పెంపుదల వుంటుంది అన్నాడు. అంతట గుడ్డివాడు చిన్నగా నవ్వి మహారాజా! నాకున్న లోకానుభవము,నా పరిశీలనా శక్తీ,దానికి తోడు నా తార్కిక అవగాహనా ఫలితమే ఆయా సందర్భాలలో నేను చెప్పినవి. వజ్రం విషయంలో,నేను ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నాక దాన్ని నా రెండు చేతుల్లోకి పదే పదే మార్చాను ఆ సమయంలో నాకు వజ్రం బోలుగా వున్నట్లు అనుభవంలోకి వచ్చింది.వజ్రానికి బోలు వుందంటే తప్పనిసరిగా అందులో ఉండేవి కప్పపిల్లలే అదే నమ్మకంతో చెప్పాను.తర్వాత గుర్రం విషయంలో నేను గుర్రం గురించి అందరు చెప్పే మాటలు వింటూనేదాని చుట్టూ తిరిగాను,అది నేను కాలి వెనక బాగం లోకి వెళ్ళగానే దాని కాలు వెనక్కి జాడించి తన్నింది.అక్కడివారు చెబుతున్న దాని ప్రకారం అది గుర్రమే,మగ గుర్రానికి,ఆడ గాడిదకు పుట్టిన దానిని 'హిన్నీ' అని అంటారు.అదేవిదంగా ఆడ గుర్రానికి, మగ గాడిదకు పుట్టిన దానిని 'మ్యూల్' అని అంటారు. కానీ విశ్లేషకులు అందరు చెబుతున్న మాటల ప్రకారం అది గుర్రమే అని నాకు అర్ధమయింది. కానీ అది కాలు వెనకకు జాడించే లక్షణాన్ని బట్టి పుట్టుకతో గుర్రమయిన అది తాగిన పాలు గాడిదవే అని నాకు అవగతం అయింది అంతే కాక ఆ గుర్రాన్ని తీసుకు వచ్చిన గ్రామీణులను వాళ్ళు మాటలలో తాము బట్టలు వుతికే రజకులమని చెప్పారు, దానితో నాకు ఆ గుర్రం తల్లి చనిపోవడంతో వాళ్ళ ఇంట సహజంగా వుండే గాడిద పాలు తాగి పెరిగింది అని అర్ధమయింది. గుర్రానికి గాడిద లక్షణాలు వస్తే ఎంత ప్రమాదం సంభవిస్తుందో ఊహించి చెప్పను. ఇక పోతే చిన్న రాణి గారి విషయంలో, నేను చిన్న రాణిగారి సయన మందిరానికి వెళ్లి, నాకు కళ్ళు లేని విషయం రాణీ గారికి ప్రత్యక్షంగా చూఇంచి, నాముందు దిసమొలతో నిలబడమని,ఆమె శరీరం పయిన పుట్టు మచ్చలు ఎక్కడెక్కడ వున్నాయో చెప్పమని కోరాను,ఆమె ఆవిధంగా చేసారు. మహారాజా! క్షత్రియ స్త్రీ ఎవరు నా కోర్కెను నాకు కళ్ళున్నయా,లేవా అనేది అప్రస్తుతం అంగీకరించరు .ఒక్క దాసీలు మాత్రమే అంగీకరిస్తారు.ఆ ఆలోచనతోనే మీకుచెప్పాను .ఇక ఆకరుగా మిమ్ములను గురించి నేను మీకు ఏ విషయాన్ని గురించి చెప్పినా అవి మీకు సమ్మతమే అయినా ఒక క్షత్రియ మహారాజుగారి లాగా ఏమోయి ఈ సందర్భంగా నీకు ఇదిగో ఈ హారం బహుకరిస్తున్నాను అనలేదు,వాణిజ్య వర్ణానికి చెందిన వ్యక్తిలా ఎప్పటికప్పుడు ఒక వర వేతనం పెంచటం నన్ను ఆచ్చార్యానికి గురి చేసింది.నా వూహ కరక్ట్ అయింది.ఇప్పుడు కూడా మీరు ముందే షరా మామూలుగా వేతనం పెంపుదల ఉంటుందని ప్రకటించారు నేను ముందే నవ్వాను.మహారాజ! ఇది విషయం.ఇక తమరి చిత్తం అన్నాడు.

మిత్రులారా! ఈ కధ నా మిత్రుడు ఎం.వి.ఎల్.ప్రసాద్ ( మూల్పూరు వెంకట లక్ష్మి ప్రసాద్ ) బావ గారు నాకు ఆత్మీయుడు,గత పదేళ్ళ నుండి ఎన్నో విషయాలు కలబోసుకున్న సన్నిహితుడు ది. .27-07-2011 న గుండె పోటు తో మరణించిన గౌరవనీయులు కొడాలి వెంకట రామకృష్ణయ్య గారికి అంకితం.                     
        ( ఈ కధను ఎంతో హృద్యంగా ముప్పయి ,ముప్పైరెండేళ్ళ క్రితం నన్ను ద్వారక తిరుమల తీసుకెళ్ళి చెప్పిన నా లాయర్ ఆత్మీయుడు స్వర్గీయ ఎస్.టి.జి.భాష్యాకార్లు కు జోహార్లు చెప్పుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.)    

Saturday, June 25, 2011

నాకు నచ్చిన నవలలో నా హృదయాన్ని హత్తుకున్న దృశ్యం


మీరందరూ చదివిన “మృత్యుపత్రం”(వీలునామా) ఉరిశిక్ష పడిన ఆ నక్సలైట్ ఖైదీ డిక్టేట్ చేస్తున్నప్పుడు విన్న జైలు సూపరిన్ టెన్ డెంట్ (ఆంగ్లో ఇండియన్) గ్లాడ్ ను కలవర పరుస్తుంది. ప్రసవానికి ఇండియా వచ్చిన తన కూతురు ‘జీన్’ కు చెబుతాడు ఆ మృత్యుపత్రం గురించి. విన్న గ్లాడ్ సాబ్ కూతురు “డాడీ ఇటీస్ ఏ రేవల్యుషనరీ పోయెం.” నాకీ కవిని కలవాలని ఉంది. అంటుంది…….
………… ……. గ్లాడ్ సాబ్ జైలులో నక్స లైట్ ఖైదీ నం 842 వీరభూషణ్ పట్నాయక్ తో “చూశావా నాకూతురు నిన్ను కవి అంది, నక్స లైట్ అనలేదు.కలుస్తావా ఆమెను?మాట్లాడతావా ఆమెతో? చిన్న కుర్రాడిలా అడిగాడు.
” ఏం?ఎందుకు మాట్లాడను? తనను,తన కవితలను మెచ్చుకునే పాఠకులు అంటే కవి కెప్పుడు అభిమానమే కదా” అన్నాడు వీరభూషణ్ పట్నాయక్ (ఉరి శిక్ష పడినఖైదీనం842).
“అరె!ఆమెను కలుసు కున్నాక ఏం మాట్లాడాలో తోచదు నీకు,ఆమెకేసి చూస్తూనే ఉండిపోతావు.నా కూతురు అని చెప్పడం కాదుకాని ఆమె యెంత అందగాడో చెప్పనలవి కాదు.ఎంత అందగత్తో నీకేం తెలుసు?ఏదీ ఉహించుకో చూద్దాం. నువ్వెంత అంచనా వేయగలవో నా కూతురు అందాన్ని”అన్నాడు గ్లాడ్ కైదీతో.
“మహా అయితే నా మృత్యువంత అందంగా వుంటుంది.”అన్నాడు ఉరిశిక్ష పడిన నక్స లైట్.
ఆ మాట వింటూనే కటకటాల్లోకి చెయ్య పోనిచ్చి పట్నాయక్ తల పట్టుకొని కటకతాలకు మెల్లగా తాటిస్తూ ” యూ బ్రేవ్ యంగ్ మాన్ రెండేళ్ళ క్రితమే నీవు నాకు పరిచయం అయి వుంటే నా కూతురుని నీకే ఇచ్చేవాడిని ……….. ఆల్ రయిట్, సాయంత్రం నా కూతురును తీసుకొస్తాను ఎడురుచూస్తుండు.” అంటూ మెల్లగా కదలి పోయాడు గ్లాడ్.
………..”ఎలావుంది మా అమ్మాయి?” గర్వంగా అడిగాడు గ్లాడ్ సాబ్
“అందంగా” వీర భూషణ్ పట్నయం జవాబు
“ఎంత?” గ్లాడ్ సాబ్ దర్పంతో కూడిన ప్రశ్న
“ఎంత అందంగా అంటే ……ఈమెను చూసి వుంటే చాలామంది రొమాంటిక్ కవుల కవితలు మరింత రొమాంటిక్ గా బాగా అందమయిన వర్ణనలతో వచ్చి ఉండేవి.” అన్నాడు పట్నాయక్
ఈ మాట వింటూనే ఫాసీ గేటు ఆవరణ అంతా దద్దరిల్లేలా నవ్వాడు గ్లాడ్ సాబ్.తన కూతురు అందచందాలను నక్స లైట్ ఖైదీ మెచ్చుకోవడంతో సాబ్ తనను తాను మరిచిపోయి మనసారా నవ్వుతూ అడిగాడు ” జీన్ ను చూసి నీకు ఏమన్నా కవిత్యం పుట్టుకు రాలేదూ?”
“లేదు. నాకామెను చూస్తుంటే వాళ్ళ అమ్మ హత్య గుర్తొచ్చింది.” -పట్నాయక్.
(గ్లాడ్ సాబ్ భార్య మారా {జీన్ కన్న తల్లి } జర్మన్ జ్యూస్. ఆమెను నియంత హిట్లర్-గెస్ట ఫోలు గ్యాస్ చాంబర్ లోకి తోసి చంపేశారు.అప్పటికి జీన్ రోజుల పాప.)
అంటే ఆ మాటతో గ్లాడ్ సాబ్ గుండె చెరువయ్యింది. జీన్ విస్మయంగా నక్స లైట్ కేసి చూసింది. అతని కళ్ళల్లో అశ్రువులు.
ఫాసీ గేటు ప్రాంతం అంతా నిశ్సభ్డం కాసేపయిన తర్వాత ఆ మౌనాన్ని బద్దలు కొడ్తూ జీన్ ” మీకు చూయించాలని నాకవితల నోట్బుక్ తెచ్చాను.”అంది.
“ఓ…. అలాగా ఏదీ చూద్దాం ” తనను తాను సర్దుకుంటూ అన్నాడు పట్నాయక్.
జీన్ తన చేతిలోని నోట్ బుక్ అతనికిచ్చింది.అతను ఆ పుస్తకాన్ని ఓ పర్యాయం తిరగేసాడు.చాలా ఖరీదయిన నీలం రంగు అందమయిన నోట్ బుక్ అట్టపైనమంచి సువాసనలు వెదజల్లే సెంట్ అద్దినట్లుంది. అందమయిన గుండ్రటి అక్షరాలతో చాలా కవితలు వ్రాసి వున్నాయి.శ్రీమంతుల ఇంట గారాల ఏకైక పుత్రిక వ్రాసే కవితల్లాగే వున్నాయి.నక్షత్రాలు,చంద్రుడు,వెన్నెల,చల్ల గాలులు,పిల్ల తెమ్మెరలు,తుమ్మెదల ఝుమ్మనే నాధాలు,మైదానాలు,ఇసుక తిన్నెలు,ఏటివడ్డులు,పడవ ప్రయాణాలు,….. ఇంక ఇంకా ఎన్నో అరిగిపోయిన రికార్డుల్లాంటి అమర ప్రేమలు ….. అలాంటివే.
ఒకటి రొండు కవితలు చదివాక ఆ నోట్ బుక్ తిరిగి ఇచ్చేస్తూ జీన్ తో “కవితలు అసంపూర్తిగా వున్నాయి ” అన్నాడు పట్నాయక్ .
“ఎందుకని?” గారాభంగా అడిగింది జీన్.
“వీటిలో జోలపాట లేవి?ప్రపంచంలో మొట్టమొదటి కవిత స్త్రీ నోటెంట జోలపాటగా బయటపడింది అందుకే కవిత శబ్దం స్త్రీలింగ శబ్దం. పుంలింగ శబ్దం కాదు.” అన్నాడు పట్నాయక్.
జీన్ నిరుత్తరురాలయింది.నిశ్శబ్దంగా ఉండిపోయింది.ఆరు గంటలు కొట్టారు జైల్లో వెళ్ళే ముందు “ఒక్కమాట అడగనా?” అంది జీన్. అడగమన్నట్టు తలూపాడు పట్నాయక్
“మీ మృత్యుపత్రం పవిత్రంగాను, ఎంతో తెజోవంతంగాను వుంది. చాలా చాలా బావుంది ‘ఓ క్రాంతి వీరుడి కవితలా’….. …… కానీ నా ఆవేదనల్లా ఆ విధంగా ఒక్కొక్క అవయవాన్ని మీ ఒంట్లో నుండి ఊడబెరుకుతుంటే, ఆ హింస, ఆ వేదన మీరెలా భరించ గలరు?మీకు భరించలేని బాధ కదా?మీరెలా భరించ గలరు?”అంది జీన్.
లేదన్నట్టు తలూపి వీర భూషణ్ పట్నాయక్ మెల్లగా అన్నాడు”ఏవి గొడ్డునోప్పులు కావో వాటికై దుఃఖించే పనిలేదు.” యార్డుల్లో హర్కేంలాన్తర్లు వెలుగుతున్నాయ్. గ్లాడ్ సాబ్ కూతురిని తీసుకొని బయల్దేరాడు.
…….నిద్రపోతున్న గ్లాడ్ నైట్ లాంప్ వెలుగులో మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తూ పక్కకు ఒరిగాడు గుమ్మందగ్గర అస్తవ్యస్తంగా వున్నా దుస్తులతో చిందరవందర జుట్టుతో జీయన్ నుంచుంది.తండ్రి మేల్కొన్నది గ్రహించి దగ్గరకొచ్చి మంచం పై కూర్చుంది. జీన్ ముఖం దుఃఖంతోఅలసిపోయిందని,ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయని,చెక్కిళ్ళు ఉబ్బాయని గుర్తించాడు గ్లాడ్. కూతురిని దగ్గరకు తీసుకొని “నిద్ర రావడంలేదామ్మా? భయం వేస్తుందా?” అంటూ బుజ్జగించాడు.
కాదన్నట్టు తలాడించి తండ్రి ఒళ్లో కాసేపలాగే ఉండిపోయింది జీన్. కొంచెంసేపాగి ఆవేశంతో లేచి తండ్రిని రెండు చేతులతో పట్టుకొని ఊపుతూ “పప్పా! యూ మస్ట్ బిహేవ్ విత్ ఎ సోల్జర్ లైకె సోల్జర్ .”అంటూ అరిచింది.
గ్లాడ్ సాబ్ ఉలిక్కిపడ్డాడు.అతని నిద్ర పారిపోయింది.కూతుర్ని అడిగాడు.”వాట్ డు యూ మీన్ జీన్?”అంటూ.
“ఐ మీన్ పప్పా ………. హి ఈజ్ నాటే ట్రేటర్ ……. పపా; హి ఈజ్ గ్రేట్ రెవెల్యూషనరీ ………
………. రియల్లీ హి ఈజ్ బ్రేవ్ సోల్జర్ ……….”
” పప్పా! హంతకులు,గజదొంగల్లాగా అతన్నెందుకు హాంగ్ చేస్తారు? అతని ప్రాణం తీయాలనుకుంటే ఎదురుగా కాల్చి చంపండి. గివ్ హిమ్ ఎ సోల్జర్ డెత్ .”
ఖిన్నుడయ్యాడు, గ్లాడ్ సాబ్ నిరుత్తరుడయ్యాడు. కూతురు మాటలు అతనికి నచ్చాయి. ఓ తేజస్వి, క్రాంతివీరుడిని దొంగలా ఉరికంభం ఎక్కించాలంటే అతనికి కూడా నచ్చలేదు. కానీ తను నిస్సహాయుడు, తను ఈ విషయంలో ఏమి చేయలేడు.
……. ……. …….. ……… …….. ………………. ………………… ………………. …….. ” జీన్! యూ డోంట్ నో మై పొజిషన్. బట్ హి నోస్ …. ……. నోస్ దట్ ఐ యామ్ ఎ లిటిల్ పెట్టి బ్యూరోక్రాట్.”
దుఃఖంతో తల్లడిల్లుతున్న జీన్ దుర్భలుడయిన తండ్రి ఒళ్లో తల పెట్టుకొని చిన్న పిల్లలా ఏడుస్తూ ఉండిపోయింది
“……. …….. ఈ రోజు నిన్ను ఆఖరు సారిగా కలుసుకుందామని వచ్చాను.” అంది జీన్, వీరభూషణ్ పట్నాయక్ తో
“మంచిదే రేపు మీ పపా పర్మిషన్ ఇచ్చినా నీవు నన్ను కలుసుకోలేవు కదా?” నవ్వుతూ అన్నాడు పట్నాయక్. మృత్యువు నీడ కింద నక్సలైట్ ఖైదీ నవ్వు జీన్ గుండెను చీలుస్తోంది …… తను తెచ్చిన డిష్ మెల్లగా కటకటాల్లోంచి ముందుకు చాపింది. ఆ డిష్ ను అందుకుంటూ ఏమిటిది అంటూ అడిగాడు పట్నాయక్.
” ఏదో స్వీట్ …… ” అంటూ నసిగింది జీన్.
” మంచిదే కదూ ……. …….. చచ్చే ముందు నోరు తీపి చేసుకొని ప్రపంచం వద్ద సెలవు పుచ్చుకోవచ్చు.” అంటూ డిష్ పుస్తకాల దొంతర మీదుంచాడు.
చాలా సేపు అలా మౌనంగా గడిపారు ఇద్దరు. జీన్ కేదో అడగాలనుంది. కానీ అడగలేకపోతుంది.ఏదో చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతోంది. ఎట్టకేలకు చివరి కేదో నిచ్చయించుకునట్టు,కొంచం తగ్గు స్వరంతో …..” నీకు నచ్చానా?” అంది జీన్.
” ఓహ్ నువ్వేవరికి నచ్చవు గనుక?” అన్నాడు పట్నాయక్ చిరునవ్వుతో.. ..
“మరయితే నా మాటొకటి వింటావా?”———-జీన్
“ఏమిటది?”——– వీరభూషణ్ పట్నాయక్ ప్రశ్న
” రేపు….. నిన్ను ……. నువ్వు……..ఉహూ , ఓ పదిహేను రొజులాగవూ ……… నాకోసం. ఆ తర్వాత మళ్లీ జన్మ ఎత్తి నా కడుపున పుట్టు. ఒక్క గుక్కలో అన్న జీన్ మాటలకు ఆశ్చ్చర్యంగా తలెత్తి ఆమె కేసి చూసాడు నక్సలైట్. ఆమె కళ్ళల్లో నీళ్ళు కదలాడుతున్నాయ్.
” నాకు నీ లాంటి బాబు కావాలి. నీ లాగే శూరుడూ, కవీనూ కేవలం నా కోసం ఓ పదిహేను రోజులాగవూ ” ఆమె కంఠంలో బుజ్జగింపు ఉంది, అర్దింపు వుంది.
నక్సలైట్, జీన్ కేసి చూడ లేక తలోంచుకున్నాడు.అతనికేమి మాట్లాడాలో తోచలేదు. అతని నిసితమయిన తెలివి తేటలు జీన్ కోమలమయిన భావాల ముందు ఎందుకు పనికి రాకుండా పోయాయి. అతడేమి మాట్లాడ లేక పోయాడు. కొంచం సేపు మౌనం తర్వాత జీన్ తన రెండు చేతులూ కటకటాల్లోనించి లోనికి పోనిచ్చి అతని తల ఎత్తి గద్గద కంఠంతో మళ్లీ అర్దించింది ” నేను నీకు నచ్చాను కదూ?”
నక్సలైట్ వీరభూషణ్ పట్నాయక్ గుండె బరువెక్కింది.అతని నోటెంట ఒక్క మాట కూడా బయటకు రాలేదు. కేవలం అలాగే అన్నట్టు తలూపాడు. దానికే సంబర పడిపోయింది జీన్. అతన్ని దగ్గరకు లాక్కొని అతని తలను తన గుండెలకు హత్తుకొని చంటి పాపను ముద్దెట్టుకున్నట్టు గబగబా ముద్దుల వర్షం కురిపించసాగింది. “ఎదురు చూస్తా నాన్నా నీ కోసం ఎదురు చూస్తా” నంటూ పిచ్చిగా గొనుక్కోసాగింది……….
         మిత్రులారా! ఈ పైన పేర్కొన్న సన్నివేశాల పరంపర మరాటీలో అనిల్ బర్వె వ్రాసిన ” థాంక్యు మిస్టర్ గ్లాడ్ ” నవలలోనివి. అనువాదకురాలు శ్రీమతి కె.సుజనాదేవి గారు.అమరుడు అనిల్ బర్వె ఈ నవల వ్రాసి ధన్యత చెందారు. ఆయనకు జోహార్లు. అనువాదం చేసిన సుజనదేవి గారు తెలుగులో అనువాద సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. ఆమెకు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ తెలుగు సాహిత్య చదువరిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

Tuesday, June 21, 2011

మృత్యుపత్రం ( వీలునామా )

"సర్ ఖైదీ నం.842 (ఉరిశిక్ష పడిన నక్సలైట్ ఖైది)ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా పేరిట మృత్యుపత్రం రాస్తానంటున్నాడు". అని సీనియర్ జైలర్, జైలు సూపరిన్ టెన్ డెంట్ కు సాల్యూట్ చేసి విన్నవించుకున్నాడు..........
ఆలకించిన జైలు సూపరిన్ టెన్ డెంట్ తల కిందకి పైకి ఆడించి "సరే ఆఫీసు టయిము అయిపోయాక టైపిస్ట్ ను, ఆ సరంజామాను తీసుకొని ఫాసీ గేటు వద్దకు రా ..."
.....గంటకోట్టగానే ఫాసీ గేటు జైలర్,సీనియర్ జైలర్,ఇద్దరు హవల్దార్లు,నలుగురు వార్డర్లు,ఓ టైపిస్ట్,ఓ టేబుల్,పెట్రోమాక్స్ లైట్,రెండు కుర్చీలు తీసుకొని జైలు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ సాబ్ ఫాసి గేటు కేసి వచ్చాడు.
వీరిని చూసిన ఖైదీ .." హ్యావ్ ఏ సీట్ మిస్టర్ గ్లాడ్" అన్నాడు వీర భూషణ్ పట్నాయక్ ( ఖైది నం.842 )..........
"కెన్ ఐ డిక్టేట్ నౌ ?" అన్నాడు తిరిగి ............ " యస్ ....యస్ .... గొణిగాడు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ .
..........దేశపు ఈనాటి నిరంకుశ ప్రభుత్వపు నామ మాత్రపు అధ్యక్ష మహాశయునికి!
మహాశయా!
రాజమండ్రి సెంట్రల్ జైలులో మీ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష కై ఎదురు చూస్తున్న నేను ...... ఖైది నం.842 వీర భూషణ పట్నాయక్ ను మరొక్కమారు ఆత్మాభిమానంతో మీకు తెలియజేయు అంశాలు:
నేను కమ్యూనిస్ట్ ను,మార్క్స్,లెనిన్,మావోల సిద్ధాంతాలు, ఆలోచనల పైన నాకు అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం.నా దేశపు నాతోటి సోదరులు, మీ నిరంకుశ ప్రభుత్వ కఠోర కబంద హస్తాలనుండి కేవలం శస్త్రకాంతి వల్లనే విముక్తులు కాగలరని నా అచంచల విశ్వాసం.అందుకే శ్రీకాకుళం ఉద్దానంగిరిజన ప్రాంతాలలో నేను,నా సహచరులు చేసిన అసఫల ప్రయత్నం సరయినదే అని మళ్ళి మళ్ళి నొక్కి చెప్పటానికి నేను గర్విస్తున్నాను.

మీ ఆయుధఫాణులయిన సైనిక బలగాలు మాలాంటి క్రాంతి వీరుల చిన్న సమూహాలపయిన సాధించిన విజయం ఓ కొత్త శారిత్రను సృష్టిస్తుంది. ఈ తాత్కాలిక పరాజయంతో మా కామ్రేడ్స్ నీతి,ధైర్యం ఏమాత్రం సన్నగిల్లలేదు,అడుగంటలేదు. ఒక్క మాట ఈ సందర్భంగా ' కేవలం విజయగర్వంతో కాదు మానవచరిత్ర మొదలయింది.సమర్పిత దారుణ పరాజయాల పరంపర నుండి. ఈ చరిత్ర అప్పటినుండి ఇప్పటికీ అలాగే నడుస్తుంది.ఇది మాకు తెలుసు చరిత్ర అధ్యయనం చేస్తే మీకూ అవగతం కాగలదు.
...........అందుకే ఈనిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలలో ఒకడిగా నేను ప్రాణ యాచన చేయను గాక చేయను, చేయబోను. నేనే గనుక అలాచేస్తే కష్టించి నిజాయతీతో పనిచేసే నాతోటి క్రాంతి సోదరుల శక్తి యుక్తులను అవమానించినట్లే.అంతేకాదు మాలాంటి ప్రజలను పీల్చి పిప్పిచేసే ప్రభుత్వాన్ని గౌరవించినట్లు,సన్మానించినట్టు అవుతుంది.అయినా మీ న్యాయస్థానం విధించిన శిక్ష మాత్రమే మీరు నాపట్ల అమలు పరచాలని,అన్నిటికన్నా ముఖ్యం నా సంపద వాటిపయ్ మీకూ ఎలాంటి హక్కు లేనందున, నానుంచి మీరు నాసంపదను లాక్కోవద్దని కోరుతున్నాను.

నేను కమ్యునిస్టును,మా సిద్ధాంతం ప్రకారం శ్రమయే మాధనం.ఆ శ్రమకు సాధనం శరీరం కాబట్టి శరీరం కూడా మానవుని వ్యక్తిగత ధనంలో ఓ భాగం. ఆ ధనాన్ని తన వారసులకివ్వడం నేటి మీ రాజ్యాంగం పరంగా చూసినా ప్రతి మనిషికి చట్టపరంగా ఉన్న హక్కు అన్న విషయాన్ని మీకు మరో మారు గుర్తు చేస్తున్నాను. ఆ నాహక్కును నేను వినియోగించుకోవడానికి నాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను.
........ టైపిస్టు నిర్వికారంగా టైపు చేస్తున్నాడు.... గ్లాడ్ సాబ్ మాత్రం ఎన్నడూ,ఎవ్వరూ కనీ వినీ ఎరుగని ఈ మృత్యు పత్రాన్ని వింటూ తన్నుతాను మరచిపోతున్నాడు.ఇవేమీ పట్టనట్టు ఖైదీ నం 842 వీర భూషణ పట్నాయక్ డిక్టేట్ చేస్తున్నాడు.
మీ ప్రభుత్వానికి,మీ న్యాయస్థానానికి కావలసింది కేవలం నా ప్రాణం. నా ధనంతో మీ కేమి పని లేదు.అలాంటప్పుడు నన్ను ఉరితీసి,ఆతర్వాత పోస్ట్ మార్టం చేసి నా శరీరాన్ని ( నా ధనాన్ని ) నాశనం ఎందుకు చేస్తారు? అలాగయితే నా శరీర సంపదను ఎవరికీ ఉపయోగించని విధంగా నేను నా సంపద (శరీరం) కోల్పోతాను.నాదేశ ప్రియ భాంధవులకోసం,నా ప్రియమయిన కార్మిక,కర్షక సోదరులకోసం నా శరీరంలోని ఆణువణువూ ధారపోయాలన్నదే నా ఆశ,ఆకాంక్ష.అందుకే మీ ప్రభుత్వానికి,మీకు తెలియపరుస్తూ,నా ఆశయసాఫల్యతకు సహకరించ వలసిందిగా కోరుచున్నాను.కనీసం మీ రాజ్యాంగంలోనే నాకున్న హక్కును,గౌరవించి నా కోర్కె సాఫల్యతకు సహకరించండి...... నన్ను ఉరితీసి నా శరీరాన్ని పోస్ట్ మార్టం చేసి ఎందుకు ఎవరికి ఉపయోగపడకుండా నా కాయాన్ని అవతల పారేయడం,అదే ఖననం చేయడమో,కాల్చి బూడిద చేయడమో చేయకండి.అందుకు బదులుగా నిపుణులయిన వైద్యుల పర్యవేక్షణలో నేను జీవించి ఉండగానే నా శరీర అవయవాలు, కళ్ళు,కిడ్నీలు,లివర్,గుండె,ఊపిరితిత్తులు,రక్తం,మూలుగు,ఎముకలు,ప్రేగులు,ఎలా ఏవి పనికి వస్తాయో అవన్నీ తీయించి వాటి అవసరం గల పేదరోగులకు ఉపయోగించండి.ఈ ప్రక్రియలో నాలో చలనం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు నేను చనిపోయినట్లు ప్రకటించండి.

........గ్లాడ్ సాబ్ జేబులోంచి విస్కీ సీసా తీసి తనకు తెలియకుండానే నక్సల్ ఖైదీ ముందుకు చాపాడు. వీర భూషణ్ పట్నాయక్ వద్దన్నట్టు తల అడ్డంగా ఊపగానే సీసా తన గొంతులో కొంత వంపుకొని మూతబిగించి జేబులో పెట్టుకొని ఆసక్తికరంగా వింటున్నాడు ఖైదీ వీలునామాని.
ఇతరులకు ఉపయోగపడే అన్ని అవయవాలు తీసాక,ఎవరికి,ఏవిధంగాను పనికిరాని నా మిగిలిన శరీరాన్ని ఎవరికి కష్టం కాని విధంగా, కాల్చో,ఖననం చేసో ఏదోవిధంగా చిద్రం చేయండి.అంతేగాని ఏవిధమయిన ధార్మిక సంస్కారాలు నా శరీరానికి జరపవద్దని కోరుకుంటున్నాను.ఇకపోతే ఈ దేశంలోని ఏప్రాంతం వాడయినా,ఏ ధర్మం వాడయినా,ఏజాతి వాడయినా, నా శరీరం నుండి సేకరించిన అవయవాలతో అవసరం పడితే స్వేచ్చగా ఏవిధమయిన ప్రతిఫలం ఎవరికి చెల్లించకుండా పూర్తి ఉచితంగా పొందవచ్చు. అయితే ఒక షరతు నా శరీరంలోని ఏ అవయవమయినా కావలసిన వారిలో ముందుగా భూమిలేని పేద రైతు కూలీలకు,గిరిజనులకు,ఆకుసలరు అయిన చిన్న కార్మికులకు,అ తదుపరి శ్రామికులకు,సన్నకారు రైతులు,స్వతంత్ర కార్మికులు, చిన్న సైజు కుటీర పరిశ్రమలవారికి,ఆ తర్వాత బుద్ధిజీవులయిన,ఉపాధ్యాయ,అధ్యాపక,డాక్టర్,ఇంజనీర్లకు,కళాకారులకు,ఇతరేతర ఏ మధ్యతరగతి బుద్ధిజీవికయినా వినియోగించవచ్చు.నా ఈ ప్రాధాన్యతా క్రమంలో ఎవరికి అవసరం లేని పక్షంలో దేశంలోని ఏ పేద వ్యక్తి కయినా, యాచకులకయినా ఉచతంగా నా శరీర అవయవాలను వినియోగించ వచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను,భారీపరిశ్రమ పెట్టుబడిదార్లకు,భూస్వాములకు,జమిందార్లకు,ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో వున్నా అధికార్లకు, మంత్రులకు,పోలీసు,మిలటరీ, ఏరాంకువాడికయినా నా అవయవాలు వినియోగించవద్దని ప్రత్యేకంగా కోరుచున్నాను.మీ ప్రభుత్వం నా ఈ అభీష్టాన్ని,హక్కును సరిగా అర్ధం చేసుకొని గౌరవిస్తదని,సరిగా ఆలోచించి,అమల్లో పెడతారని,నా పేద సోదరులకు నా ఆణువణువూ ఉపయోగపడే విధంగా,నా ఆలోచనాపరంగా తగు రీతిలో నా శరీర సంపద ఉపయోగ పడుతుందని అందుకు సహకరిస్తారని ఆశిస్తాను. రాష్ట్రపతిగా మీరు స్వయంగా ఈ నా శరీర సంపద వినియోగ విషయంలో జోక్యం చేసుకొని నా అభీష్టానికి సహకరించండి.

ఈ విషయంలో అవసరం అయితే చట్టంలో ఏవయినా మార్పులు చేయవలసి వచ్చినా ఆ చట్ట సవరణలు చేసయినా నా సంపద పై నాకువున్న సహజ అధికారాన్ని నన్ను వినియోగించుకోనిమ్మని కోరుతూ,తమ నిర్ణయాదికారానికై,ఎదురు చూస్తుంటాను........ టైపిస్ట్ ఆగగానే సీనియర్ జైలర్ ముందుకొచ్చి పేపర్స్ అన్ని సరిగా నాలుగు సెట్లుగా సర్ది పిన్ చేసి ఖైదీ నం:842 కు అందించాడు.అతడోసారి చదివి పూర్తి సంతృప్తితో సంతకం చేసాడు.జైలర్ వాటిని భద్రంగా తీసుకొని గ్లాడ్ సాబ్ కు అందించాడు వినయంగా. "ఖైదీ నా సమక్షం లో ఎవరి వత్తిడి లేకుండా వ్రాసాడని" సర్టిఫై చేసి సంతకం చేసాడు.జమేదార్ కుర్చీ తీసుకేల్లుతున్నాడు,గ్లాడ్ బయటకు వెళ్లబోయే వాడల్లా ద్వారం వద్ద ఆగి ఓ క్షణం ఖైదీ కేసి నఖ శిఖ పర్యంతం పరిశీలించాడు.ఒకఆడుగు ఖైదీ కేసి వేసి చేతిలోని క్యాప్ స్టన్ సిగరెట్ టిన్ నక్సలైట్ కేసి చూపుతూ అన్నాడు " డూ యూ లైక్ ఇట్ ".
ఏదో గొణుక్కుంటూ పట్నాయక్ ఓ సిగరెట్ అందుకున్నాడు. వెంటనే పూర్తి టిన్ను ఖైదీ చేతిలో ఉంచుతూ "కీప్ ఇట్ విత్ యూ "అంటూ గ్లాడ్ సబ్ బయటకు నడిచాడు...................
మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈ మృత్యుపత్రం(వీలునామా) ను మరాటి లో అనీల్ బర్వే వ్రాసిన'థాంక్ యు మిస్టర్ గ్లాడ్' కు శ్రీమతి కె.సుజనాదేవి తెలుగు సేతలో చదివాను. నన్ను ఉద్విగ్న పరచింది ఈ రచన దాంతో మీకు కూడా పరిచయం చేయాలనిపించి మీ ముందుంచుతున్నాను. నాద్రుస్టిలో అనీల్ బర్వే ఇప్పుడు లేడు కాబట్టి ఈ రచనతో ఆతని జన్మ ధన్యమయినదని భావిస్తూ అతనికి జోహార్లు చెప్పుతున్నాను.ఇకపోతే సుజనాదేవి గారు ఈ నవలను తెలుగు చేయడం ద్వారా ఆమె తెలుగు రచనా రంగానికి యెనలేని సాహితీ సేవ చేసారని భావిస్తూ ఆమెకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. .........

Wednesday, March 23, 2011

జోహార్! భగత్ సింగ్ జోహార్

భగత్ సింగ్ జీవితం పోరాటాల చరిత్ర
భగత్ సింగ్ పోరాటం త్యాగాల చరిత్ర
భగత్ సింగ్ జీవితం - పోరాటం
భారత దేశ స్వాతంత్ర్య చరిత్ర