తన పరిచయంతో మనలోని చదువరిని అన్వేషణ వైపు, అన్వేషణా పరుడిని తార్కిక ఆలోచనా
పరుడిగా మలచిన వివేకవంతుడు, గొప్ప వివేచనాపరుడు ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు గారు.
వేణుగోపాలరావు గారు ఏది చెప్పినా ఆదేశాలు, ఉపదేశాలు,సందేశాలుగా కాక సూచనలు ఇచ్చే మిత్రుడి ముచ్చట్లుగా ఉండేవి. మాస్టారి రూపం, ఆహార్యం, సామాన్యంగా వుండి, నిరాడంబరత,ఆప్యాయత, కలుపుగోలు తనం ఎవరినైనా ఆకట్టుకొనేది. అయితే వేణు మాస్టారు తన ఆలోచనలను గాని, ఏదేని విషయం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే విషయంలో గాని, ఏమాత్రం నాన్చుడు ధోరణి లేకుండా, స్పష్టంగా, సూటిగా,జంకు, గొంకు లేకుండా ధైర్యంగా కుండ బ్రద్దలు గొట్టినట్లు, బల్లచరిచి మరీ చెప్పేవారు.అలాంటి సమయాలలో ఎవరైన, ఏమైనా అనుకుంటారేమోననే మొహమాటం అసలు ఉండేదికాదు. అయితే అంత మాత్రం చేత ఎవరి మాట వినరు అనుకుంటే పొరపాటే. తార్కికంగా ఎవరైన ఏ విషయం మీదయినా మాస్టారి అభిప్రాయంలోని పొరపాటును ఎత్తి చూపితే దానికి ఆధారాలు వున్నట్లు తేలితే ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి గాని, సవరించుకోవడానికి గాని, వెనకాడేవారుకారు. అట్లాగే ఎదుటివారి అభిప్రాయాలు,నిర్ణయాలు,మనకు తప్పుగా అన్పించితే, వాటిని సహేతుకంగా తప్పు అని నిరూపించే టప్పుడు కూడా గేలిచేసినట్లుగానూ, వ్యంగ్యంగానో, మన భాష,వ్యక్తీకరణ, ఉండగూడదని,అది వారిని నొప్పించే విధంగా గాకుండా, వారు తమ తమ అభిప్రాయాలను,నిర్ణయాలను మార్చుకొనేదిగా వుండాలని పదే పదే చెప్పేవారు.
వేణుగోపాలరావు మాష్టారు విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గా, కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గాను,విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గాను, ఏలూరు సర్.సి. ఆర్.రెడ్డి. ఇంజనీరింగ్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గాను, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గాను,తిరుపతి లోని మొహనబాబు విద్యాసంస్థల సలహామండలి సభ్యునిగా విశేషమైన, గణనీయమైన, పరిపాలనాసంబంధిత విధ్యసేవ చేసారు.అంతకుముందు కాలంలో మాస్టారు,అనంతపురం,వరంగల్,కాకినాడలలోను,ఆంధ్రా యూనివెర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లోను మేఖానికల్ బ్రాంచ్ అధ్యాపకునిగా,ప్రొఫెసర్ గాను పరిగనించదగిన విధ్యబోదనాసేవ చేసారు.ఎందఱో అసంఖ్యాకు లయిన విద్యార్ధులకు, మాస్టారుగా,హితునిగా,సన్నిహితునిగా,వుండి వారి తలలో మెదడుగా ఉంటూ మనస్సులో చెరగని ముద్ర వేసి ప్రాతః స్మరనీయునిగా వున్నారు అనటంలో అతిశయోక్తి లేదు.
సిల్వర్ టంగ్ మాస్టారు
వేణుగోపాల రావుగారు
ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసి తిరిగి ఆంధ్రా యూనివేర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో రిటైర్ కావాలని కే.ఎల్.సి.లో రిసైన్ చేసి వైజాగ్ వెళ్ళిపోయారు.ఆ తర్వాత కే.ఎల్.సి. యాజమాన్యం చైర్మన్ శ్రీ లక్ష్మయ్య గారు మద్రాస్ ఐ.ఐ.టి.నుండి రాయుడు గారని మంచి పేరున్న ప్రొఫెసర్ గారిని ( వీరిది తణుకు ఏరియ అనుకుంటా ) తీసుకువచ్చారు.అయితే రాయుడుగారు అయిదారు రోజులుకూడా ప్రిన్సిపాల్ గా ఉండలేక ఉక్కిరి బిక్కిరి అయి ఊపిరి ఆడనట్లుగా వుందని తిరిగి మద్రాస్ ఐ.ఐ.టి.కి.వెళ్ళిపోయారు. అదేంటండి! రాయుడు గారు అంటే మనమెక్కడ చేయగలం , ఇక్కడ ఉన్నంత స్వేఛ్చ గా బ్రాడ్ గా అక్కడ వుండదు/వుండరు.అక్కడ ఉన్నంత కాంజస్ట్ గా ఇక్కడ వుండదు/వుండరుఅన్నారు. అయితే తుమ్మల వేణుగోపాలరావు గారు అక్కడ కృష్ణ నదికి అవతల ఇవతల వున్న ఆ రెండు కాలేజీ లకు అన్నిఏండ్లు చేసారు గదటండి అంటే, రాయుడుగారి జవాబు: ఆయనా ! ఆయనకేంటి, ఆయనది సిల్వర్ టంగ్. ఆవిధ మయిన వ్యవహారశైలిని నిర్మించుకోవడం ఆయనకే చెల్లు. అందుకే ఆయన్ను అందరూ వేణుగోపాలరావు మాస్టారుఅంటారు. అని సెలవిచ్చారు.
ప్రేమికుడి గా ముందువరుసలో...
వేణు మాష్టారు " కమ్యునిస్టును అంటే స్పష్టంగా చెప్పలేను గాని, కమ్యునిజం ప్రేమికుడిని అని చెప్పడానికి ఎక్కడా కూడా మొహమాట పడను."అని చెప్పేవారు.కమ్యునిస్టుగా తనకు తానుగా మారటానికి తాను కూడా గట్టి కృషి సల్పలేదు కానీ దేశంలో కమ్యునిజం రావాలని కోరుకునే వారిలో ఒకడిగా ముందు వరుసలో నిలుచోవడానికి నాకేం అభ్యంతరం లేదు అనే మాస్టారి నిరాడంబరత,నిజాయితి,కల్మషంలేని ఆయన ఆలోచనాసరళి, భావ వ్యక్తీకరణ,బక్క పలచని నిండైన నిలువెత్తు ఆకృతి ఆయన ఎక్కడ వుంటే అక్కడ అందరిని ఆకట్టుకొనేది అనటంలో అతిశయోక్తి లేదు. అయితే గత రెండు మూడేళ్ళుగా మాస్టారి ఆరోగ్యం అంతగా బాగో లేదని తెలిసి అంత చైతన్యం, చలనం, వేగం, గా వుండే వేణుగోపాలరావు మాస్టారుని తలుచుకుంటేనే మనస్సు కలుక్కు మంటుంది. మాష్టారు త్వరగాకోలుకోవాలని, నిండు నూరేళ్ళు పూర్తి ఆరోగ్యంగా వుండాలని సదా మునుపటిలాగే చైతన్యాన్ని,చలనవేగాన్ని,ప్రజలలో పెంచేందుకు కృషి చేయాలని కాంక్షిస్తూ................
No comments:
Post a Comment