Tuesday, June 29, 2010

నాకు నచ్చిన పాలస్తీనా కధ..........." తీర్పు." --ఘసన్ కన్ఫానీ .

సర్వే అధికారి వచ్చి తనకున్న కొద్దిపాటి భూమిని కొలిచి తన రిజిస్టర్ లో వ్రాసుకొని దానికి కారణం ప్రభుత్వానికి,ఇబ్రహం ఎల్హమీద్ కు మధ్యగల 'వివాదమే'నని చెప్పినప్పుడు హమీద్ ఏ మాత్రంపెట్టలేదు. పైగా రిజిస్టరు చేసుకోవయ్యా,చేసుకో!కలము కాగితము కన్నా మరేదీ చౌకగా లేదు- నేను మాత్రం నా పొలాన్ని
ఇచ్చేది లేదు. అని గట్టిగ చెప్పాడు.
దాదాపు ఏబయ్ ఏళ్ళుగా తను ఆ పొలం ఎరుగును.తను చిన్న పిల్లడుగా వున్నప్పుడు
ఆ పొలం పనులలో తండ్రికి చేదోడు వాదోడుగా.వుంటూ ఉండేవాడు.తండ్రి మరణానంతరం తనే ఆ పొలాన్ని
సాగు చేయసాగాడు.అదే విధంగా ఇప్పుడుకూడా పొలాన్ని దున్ని సాగు చేసుకుంటున్నాడు.
రోజులు దొర్లుతున్నాయి దాదాపుగా ఒక ఏడాది కాలం గడిచింది.ఆ వివాదాస్పద మయిన
భూమి విషయమై హైఫా లోని కోర్టులో హాజరు కావలసిందిగా తనకు తాకీదు అందేంతవరకు ఆ సర్వే
ఆఫీసరు రికార్డు చేసిన విషయాన్నే మరిచిపోయాడు హమీద్.విచారణ రోజున తన చిన్నకొడుకును వెంట
పెట్టుకొని హైఫా లోని కోర్టుకు హాజరయ్యాడు.అబ్దుల్ హమీద్,అబ్దుల్ హమీద్,అబ్దుల్ హమీద్, మూడు సార్లు కోర్టు జవాను గాడిదలా ఓండ్రపెట్టాడు. హమీద్ కోర్ట్ హాలులో అడుగు పెట్టాడు.విచారణ మొదలయ్యింది.
ముగ్దేల్ కురం ప్రాంతంలో గల 48 వ నంబరు భూమికి 1967 కి పూర్వం నీవే హక్కు దారువని, యజమానివని రుజువు పరచుకోగలవా?-- జడ్జి ప్రశ్నించాడు. హమీద్ ఇలా జవాబు ఇచ్చాడు. " అవునండి అయ్యగారు!నేను ఆపొలాన్ని మా తండ్రి గారి నుండి వారసత్వంగా పొందాను. నా తండ్రిగారి,మీ తండ్రిగారి ఆత్మలకు శాంతి చేకూర్చవలసిందిగా ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను.

" నీ చెత్త వాగుడు కట్టిపెట్టు.నీ తండ్రి గొడవ ఇక్కడ ఎందుకు?నీ వాదనను రుజువు పరచుకోవటానికి నీ దగ్గర ఏమయినా దాఖలాలు, రుజువు పత్రాలు ఉన్నాయా?" జడ్జిగారు గాండ్రించారు.
కొంచంసేపాగి హమీద్ ఇలా అన్నాడు--అయ్యా, నేను మళ్ళి మళ్ళి చెబుతున్నాను.దాన్ని నేను మా తండ్రిగారి నుండి పొందాను.నా15 వ ఏట నుండి నా తండ్రి తో కలసి ఆ నా పొలాన్ని సేద్యం చేసాను.
" ఇది రుజువు క్రిందికి రాదు." జడ్జిగారింకా ఇలా అన్నారు--సరే ఆ పొలంలో అరవయ్ శాతం రాళ్ళ మయం. కాబట్టి అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది.( నిధులు, నిక్షేపాలు,ఖనిజసంపద వున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.రాళ్ళు కూడా ఖనిజ సంపద క్రిందకు వస్తుంది.)
" ఏంటి?-- అరవయ్ శాతమా,డెబ్భై శాతమా? ట్రాక్టరు ఒక్క దెబ్బకు దున్ని అవతల పారేస్తుంది. అయ్యా! ఒకటి అరా రాళ్ళు వుంటే ఉండవచ్చు-- కానీ ఒక్కొక్క రాయి నుండి ఒక్కొక్కద్రాక్ష తోట ను పండించవచ్చు. అదేమీ వట్టి పోయిన భూమి గాదు. మా తండ్రిగారు తన జీవితాన్నంతా ఆ ఉన్న నాలుగు రాళ్ళు ఎరివేసేందుకే అంకితం చేసాడు. నేను అదేచేస్తున్నాను. అయినా అంతగా ప్రభుత్వం కావాలనుకుంటే నా పొలం తప్ప మరేమీ కనబడలేదా?" దాదాపు అరచినట్లుగా ప్రశ్నించాడు హమీద్.
దానితో జడ్జిగారి కోపం తారస్థాయికి చేరుకొంది."ఇటువంటి చెత్త వాగుడు కట్టి పెట్టవలసిందిగా మరో సారి హెచ్చరిస్తున్నాను.ఇతరుల ఆస్తిని ప్రభుత్వం అనవసరంగా ఆక్రమించదు.అది దాని భాద్యత కూడా" అంటూ తీవ్రంగా హెచ్చరించాడు.
" హక్కా?-- భాధ్యతా?"--- వ్యంగ్యంగా అన్నాడు ... హమీద్ . "అయ్యా, ప్రభుత్వం చాలా బలమైనదని నాకు తెలుసు. నాకేమున్నది .... నాలుగెముకులు, కాస్త కండ తప్ప,అటువంటి నాపైన ప్రభుత్వం కలియబడటం........"
" ఏయ్ మనిషి ఇటు చూడు. నువ్విప్పుడు కోర్టులో వున్నావు.అర్ధం లేని పిచ్చి వాగుడు వాగకు".జడ్జి గారు మరోమారు హెచ్చరించి కొంచంసేపాగి ఇలా అన్నారు---సరే ప్రభుత్వం సగంపాలు తీసుకొని మిగతా సగం నీకే ఇచ్చేస్తుంది.దీనికేమంటావు?
హమీద్ తల అడ్డంగా త్రిప్పుతూ " అయ్యా! నాకు ప్రభుత్వం అనే అన్నయ్య ఉన్నట్టుగా కానీ, వాడితో ఇలా వాటా పంచుకోవాలనిగాని మా నాన్న నాకెప్పుడూ చెప్పలేదే!" అన్నాడు.
జడ్జిగారు సహనం కోల్పోయారు---"ఇదిగో ముసలాడా!ఈ నిర్ణయానికి నీవు కట్టుబడి వుండటం సమంజసంగా వుంటుంది.సమాధానం సూటిగా చెప్పు. దీనికి నీవే మంటావు". అంటూ తీక్షణంగా చూసాడు హమీద్ వంక.
"భగవంతుని సాక్షిగా చెబుతున్నాను." అయ్యా! మీ తీర్పు ఏడ్చినట్టుగా వుంది. చాలా చాలా దారునంగాను, చీకటిలా భయంకరంగాను వుంది." అంటూ బోను దిగి " అన్యాయమైన తీర్పు ఎంతో కాలం జీవించదు." అని గొణుక్కుంటూ, తన చేతికర్ర పోటేసుకొంటు తన చిన్న కొడుకు తోడుతో వెళ్ళిపోతున్నాడు.
ఇబ్ర్హం ఎల్ హమీద్.
__ __సూర్యుడు పశ్చిమాద్రిన అస్తమిస్తున్నాడు. రేపు తిరిగి తూర్పున ఉదయించడానికి.__ __

No comments:

Post a Comment